సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్‌ ఫైర్‌ | Kamboj Shouldn't Have Taken New Ball: Ponting Lambasts Gill And Bumrah | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్‌ ఫైర్‌

Jul 25 2025 10:54 AM | Updated on Jul 25 2025 11:14 AM

Kamboj Shouldn't Have Taken New Ball: Ponting Lambasts Gill And Bumrah

మాంచెస్టర్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తనదైన శైలిలో ‘బజ్‌బాల్‌’ ఆటతో చెలరేగింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (Zak Crawley), బెన్‌ డకెట్‌ (Ben Ducket) దూకుడైన బ్యాటింగ్‌తో దుమ్ములేపారు. క్రాలీ 113 బంతుల్లోనే 84 పరుగులు చేయగా.. డకెట్‌ కేవలం 100 బంతుల్లోనే 94 పరుగులతో అలరించాడు. వన్డే మాదిరి బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరిని ఆపడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు.

దీంతో ఒక్క సెషన్‌లోనే ఏకంగా 148 పరుగులు చేసిన ఇంగ్లండ్‌.. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill), ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ విమర్శలు గుప్పించాడు.

సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా?
అరంగేట్ర పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌కు ముందుగానే బంతి ఇచ్చి గిల్‌ తప్పు చేశాడని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను కాదని అన్షుల్‌ను రంగంలోకి దించినందుకు భారత్‌ భారీ మూల్యమే చెల్లించిందన్నాడు.

మరోవైపు.. బుమ్రా సైతం వ్యూహాత్మకంగా బౌలింగ్‌ చేయలేకపోయాడని పాంటింగ్‌ విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లు తడబడ్డారు. సిరాజ్‌ను కాదని అన్షుల్‌ కంబోజ్‌కు కొత్త బంతిని ఇచ్చి తప్పు చేశారు. అతడిని ముందే రంగంలోకి దించడం నాకైతే నచ్చలేదు.

బుమ్రాకు ఏమైంది?
డకెట్‌ కొట్టిన తొలి ఐదు బౌండరీలలో తొలి సిక్సర్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగానే వచ్చింది. టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. ముఖ్యంగా బుమ్రా స్టాతమ్‌ ఎండ్‌ నుంచి కాకుండా ఆండర్సన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసి పొరపాటు చేశాడు. నిజానికి ముందు కూడా స్టాతమ్‌ ఎండ్‌ నుంచే ఎక్కువ వికెట్లు పడ్డాయి’’ అంటూ పాంటింగ్‌ గిల్‌, బుమ్రా తీరును విమర్శించాడు.

ధారాళంగా పరుగులు  ఇచ్చుకున్న భారత బౌలర్లు
కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. 264/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. 

ఇందుకు ఇంగ్లండ్‌ దీటుగా బదులిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి కేవలం రెండు వికెట్ల నష్టపోయి 46 ఓవర్లలోనే 225 పరుగులు చేసింది. క్రాలీని రవీంద్ర జడేజా అవుట్‌ చేయగా.. డకెట్‌ వికెట్‌ను అన్షుల్‌ దక్కించుకున్నాడు. ఓలీ పోప్‌ 20, జో రూట్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

ఇక భారత బౌలర్లలో గురువారం బుమ్రా 13 ఓవర్లలో 37 పరుగులు, అన్షుల్‌ 10 ఓవర్లలో 48, సిరాజ్‌ 10 ఓవర్లలో 58 పరుగులు, శార్దూల్‌ ఠాకూర్‌ 5 ఓవర్లలోనే 35 పరుగులు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు.

చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్‌ లేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement