‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్‌ లేదు’ | 10 Stitches After Falling Off From Scooty: Ishan Kishan cant Replace Pant | Sakshi
Sakshi News home page

‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్‌ లేదు’

Jul 24 2025 5:25 PM | Updated on Jul 24 2025 5:46 PM

10 Stitches After Falling Off From Scooty: Ishan Kishan cant Replace Pant

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. రెండో రోజు ఆటలో భాగంగా మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur- 41) ఆరో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత పంత్‌ క్రీజులోకి వచ్చాడు.

వికెట్‌ కీపర్‌గా జురెల్‌
ఇదిలా ఉంటే.. పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చే కంటే ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. జట్టు కోసం అతడు ఆడతాడని.. అయితే, ధ్రువ్‌ జురెల్‌ పంత్‌కు బదులు వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని తెలిపింది.

అయితే, అంతకు ముందు.. పంత్‌ ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమవుతున్నాడనే వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. పంత్‌ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్‌ అయినందు వల్ల అతడు ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి వస్తాడంటూ..
అంతేకాదు.. పంత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి వస్తాడని తెలిపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇషాన్‌ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో అతడి సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఇషాన్‌ ఇటీవల స్కూటీ మీద నుంచి కిందపడ్డాడు.

పది కుట్లు పడ్డాయి
అతడి చీలమండకు గాయమైంది. పది కుట్లు పడ్డాయి. ప్రస్తుతం కుట్లు తీసినా అతడి ఎడమ చీలమండకు ప్లాస్టర్‌ వేసే ఉంది. సెలక్టర్లు అతడిని గురువారం అతడిని సంప్రదించిన మాట నిజమే. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’’ అని వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. ఒకవేళ పంత్‌ గనుక ఐదో టెస్టుకు దూరమైతే నారాయణన్‌ జగదీశన్‌ అతడి స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌ పేర్కొంది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను టీమిండియాలో చేర్చడం దాదాపు ఖరారైపోయిందని వెల్లడించింది.

కాగా ఇంగ్లండ్‌- ఇండియా మధ్య ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య ఇంగ్లండ్‌ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య బుధవారం మాంచెస్టర్‌ వేదికగా నాలుగో టెస్టు మొదలైంది. ఈ క్రమంలో గురువారం నాటి భోజన విరామ సమయానికి టీమిండియా 105 ఓవర్లు పూర్తయ్యేసరికి.. ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అప్పటికి పంత్‌ 39, వాషింగ్టన్‌ సుందర్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement