
నాలుగో టెస్టులో ఆడనున్న టాప్ పేసర్
ఫిట్‌గా మారిన రిషభ్ పంత్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టులో ఆడటం ఖాయమైంది. ఈ విషయాన్ని జట్టు సభ్యుడు మొహమ్మద్ సిరాజ్ నిర్ధారించాడు. ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు కూర్పులో ప్రతి రోజూ మార్పులు జరుగుతున్నాయని... అయితే బుమ్రాను ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు అతను వెల్లడించాడు.
పని భారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ సిరీస్‌లో బుమ్రా ఏవైనా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడనే టీమ్ మేనేజ్‌మెంట్ ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి రెండు టెస్టుల్లో అతను ఎందులో బరిలోకి దిగుతాడనే విషయం టీమ్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఆడేందుకు సిద్ధం కావడంతో దీనిపై స్పష్టత వచి్చంది. గత టెస్టుకు, నాలుగో టెస్టుకు మధ్య ఎనిమిది రోజుల విరామం కూడా ఉండటంతో బుమ్రాకు తగినంత విశ్రాంతి కూడా లభించింది.
భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సమంగా నిలిస్తే ఓవల్‌లో జరిగే చివరి టెస్టులోనూ బుమ్రా ఆడే అవకాశం ఉంది. అర్‡్షదీప్ నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఆడటం కూడా సందేహంగానే ఉంది. సోమవారం అతను స్వల్పంగా ప్రాక్టీస్ చేసినా... దీని వల్ల ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి అంచనాకు రాలేదు. మరో రెండు రోజుల సాధన తర్వాతే అతని విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. వికెట్ కీపర్ పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో అతను బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు.
సాయి సుదర్శన్‌కు చాన్స్!
గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మాంచెస్టర్ టెస్టులో చోటు దక్కవచ్చు. సుదర్శన్ ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడాడు. అతను ఆడితే పిచ్ పరిస్థితిని బట్టి ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్‌లలో ఒకరికే అవకాశం లభిస్తుంది. ఆకాశ్‌దీప్ కూడా తప్పుకుంటే ప్రసిధ్, కొత్త ఆటగాడు అన్షుల్‌లలో ఒకరిని ఎంపిక చేస్తారు.
రెండు టెస్టులు ఆడిన ప్రసిధ్ పూర్తిగా విఫలం కాగా... ఆకాశ్‌దీప్ శైలిలోనే సీమ్ బౌలింగ్ చేసే అన్షుల్ అరంగ్రేటం చేసే చాన్స్ ఉంది. అయితే ఆటగాళ్ల గాయాలతో టీమ్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నా... ఆశ్చర్యకరంగా జట్టులో ఉన్న ఏకైక రెగ్యులర్ స్పిన్నర్, ఇంగ్లండ్‌పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉన్న కుల్దీప్ యాదవ్ పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యకరం. టీమిండియా వ్యూహాల ప్రకారం చూస్తే కుల్దీప్ ఒక్క టెస్టూ ఆడకుండానే తిరిగి వచ్చేలా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ ఒక మార్పుతో...
నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. గత టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ జట్టులోకి వచ్చాడు. 2017 తర్వాత అతనికి ఇదే తొలి టెస్టు కానుంది.
ఇంగ్లండ్ తుది జట్టు: స్టోక్స్ (కెపె్టన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, డాసన్, క్రిస్ వోక్స్, కార్స్, జోఫ్రా ఆర్చర్.
భారత్ తరఫున ఆడే అవకాశం రావడమే అన్నింటికీ ప్రేరణ
అందిస్తుంది. దాంతోనే కావాల్సినంత ఉత్సాహం వస్తుంది. మైదానంలో వంద శాతం కష్టపడటమే నాకు తెలిసింది. దేవుని దయ వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నాను. పని భారం తగ్గించడం ముఖ్యమే కావచ్చు కానీ చివరకు నేను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాననేదే స్కోరు బోర్డులో కనిపిస్తుంది. నాకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకొని జట్టును గెలిపించడమే నా లక్ష్యం. కాబట్టి ఎక్కువ ఓవర్లు వేయడంలో ఎలాంటి రహస్యమూ లేదు. ఏ బౌలరైనా వికెట్లు పడగొట్టేందుకు ప్రయతి్నస్తాడు.
నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా కొన్నిసార్లు అదృష్టం కలిసి రావడం లేదు. గత సిరీస్‌తో పోలిస్తే ఈ సారి డ్యూక్స్ బంతులు తొందరగా మెత్త పడుతున్నాయనేది వాస్తవం. అయితే అన్నీ మనకు అనుకూలించవు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం ముఖ్యం. గత టెస్టులో చివరి వికెట్‌గా అవుటైనప్పుడు చాలా బాధపడ్డాను. దాని నుంచి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టింది. మ్యాచ్ మేం గెలవాల్సింది. జడేజా, బుమ్రా బాగా ఆడినా మేం ఓడాం. చాలా ముందే 80 పరుగుల తేడాతో ఓడిపోయినా ఇంతగా బాధపడేవాళ్లం కాదేమో. చాలా చేరువగా వచ్చి గెలవలేకపోవడం నిరాశకు గురి చేసింది.
– మీడియా సమావేశంలో సిరాజ్