
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు తడబడతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 225 పరుగులు స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(84), బెన్ డకెట్(94) దంచికొట్టారు.
ప్రస్తుతం క్రీజులో జో రూట్(11), ఓలీ పోప్(20) ఉన్నారు. భారత బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఒక్క వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.
రిషబ్ విరోచిత పోరాటం..
కాగా ఈ మ్యాచ్ తొలి రోజే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడటంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్ సంధించిన బంతి పంత్ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
తదనంతరం స్కానింగ్‌లో బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్‌పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్‌లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడటం వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
లేదంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను అవుట్ చేశాడు.
చదవండి: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌కు టీమిండియా