
బీసీసీఐ ఆధ్వర్యంలోనే నిర్వహణ
త్వరలోనే అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ/ఢాకా: భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించేందకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు చర్చించినట్లు తెలిసిది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఏసీసీ వెల్లడించనుంది. ఏసీసీలోని మొత్తం 25 సభ్య దేశాలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నాయి. మొదట్లో ఈ సమావేశానికి బీసీసీఐ గైర్హాజరైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ భారత బోర్డు నుంచి సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) పాల్గొన్నట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
‘ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించనున్నాం. టీమిండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడనుంది. షెడ్యూల్‌పై చర్యలు ఇంకా జరుగుతున్నాయి’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ 25 సభ్య దేశాలన్నీ పాల్గొన్నాయని, బీసీసీఐతో సంప్రదింపులు పూర్తయిన వెంటనే తుది షెడ్యూలును త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పూర్తిగా క్రికెట్ క్రీడ, అనుబంధ, సభ్యదేశాల్లో ఆట గురించే తప్ప ఇతరత్రా రాజకీయ అంశాలేవీ చర్చించలేదని ఆయన చెప్పారు.
బీసీసీఐ భౌతికంగా పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే నేను కూడా సింగపూర్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో భౌతికంగా పాల్గొనలేదు’ అని అన్నారు. సెపె్టంబర్‌లో రెండు వారాల్లోనే ఈ టి20 టోర్నీని ముగించే ప్రణాళికల్లో బీసీసీఐ ఉంది. ఎందుకంటే ఆ నెలాఖరి వారంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ మొదలు కానుంది.
భారత్‌లో ఎందుకు జరగడం లేదు?
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్‌లో ఈ సారి ఆసియా కప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించాలనుకున్నారు. అయితే పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడింది. ఆ సందర్భంలోనే ఇకపై పాక్ కూడా తమ మ్యాచ్‌ల్ని తటస్థ వేదికైన శ్రీలంక, లేదంటే యూఏఈలో ఆడుతుందని ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఇటీవలే పాక్ వైఖరిలో మార్పు వచ్చింది. భారత్‌లో ఆడేందుకు సై అంటూ సంకేతాలిచ్చింది.
సాక్షాత్తూ పాకిస్తాన్ క్రీడాశాఖ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ భారత్‌లో పహల్గామ్‌లో ఉగ్రమూకల ఊచకోత అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో యుద్ధవాతావరణ పరిస్థితులు తలెత్తాయి. చివరకు కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు తెరపడింది. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురై నెలలు గడవకముందే పాక్ ఆటగాళ్లను భారత్‌లోకి అనుమతిస్తే వచ్చే సమస్యలు, విమర్శలను ముందే గుర్తించిన బీసీసీఐ తమ ఆతిథ్యాన్ని యూఏఈలో ఇచ్చేందుకు సిద్ధపడింది.