హర్మన్‌, మంధాన మధ్య విభేదాలు! | Reports-Captaincy-Main-Conflict-Between-Harmanpreet-Smriti Mandhana | Sakshi
Sakshi News home page

హర్మన్‌, మంధాన మధ్య విభేదాలు!

Oct 7 2026 9:06 AM | Updated on Oct 7 2026 10:14 AM

Reports-Captaincy-Main-Conflict-Between-Harmanpreet-Smriti Mandhana

భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది. మంగళవారం హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసి ఆశ్చర్యపరిచింది. ఆ వెంటనే బీసీసీఐ హర్మన్ స్థానంలో స్మృతి మంధానను కెప్టెన్‌గా , వైస్ కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను నియమించడమే గాక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు జట్టును కూడా చకాచకా ప్రకటించేసింది. 

ఇటీవలే ఆసియా గేమ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోనే మన అమ్మాయిలు స్వర్ణం గెలిచారు. అంతా సవ్యంగా సాగుతుం దనుకుంటున్న దశలో హర్మన్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రకంపనలు సృష్టించింది. రాజీనామా విషయం పక్కనబెడితే.. హర్మన్‌, మంధాన మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఈ ఇద్దరు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని, జట్టు కూడా రెండుగా చీలిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతర్గత నివేదికల ప్రకారం, వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ ఫ్లాష్ పాయింట్‌గా నిలిచిందట. గత కొంతకాలంగా జట్టు కెప్టెన్సీకి సంబంధించి ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల మధ్య పొసగడం లేదు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ ఇద్దరు సీనియర్లు జట్టను రెండుగా చీల్చినట్లు  సమాచారం.

జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ దూకుడుగా ఉండే మైండ్‌సెట్‌తో నిర్ణయాలు తీసుకుంటుండగా, వైస్ కెప్టెన్‌గా ఉన్న మంధాన శైలి భిన్నంగా ఉండేది. ముఖ్యంగా జట్టు వ్యూహాలు, కమ్యూనికేషన్ విషయంలో ఇద్దరి మధ్య సయోధ్య లోపించినట్లు తెలుస్తోంది. ఇటీవలే గువాహటిలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. 

జట్టు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించిన ఈ సమావేశంలో నాయకత్వ మార్పు అనివార్యమని స్పష్టం చేసింది. అయితే హర్మన్‌ను కేవలం టీ20 కెప్టెన్‌గా మాత్రమే తప్పుకోవాలని, వన్డే, టెస్టుల్లో కొనసాగాలని బీసీసీఐ ఆఫర్ ఇచ్చినప్పటికీ, హర్మన్ ఉంటే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉంటానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనికి బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో హర్మన్ తన కెప్టెన్సీ పదవికి గుడ్‌బై చెప్పింది.

ఇన్నాళ్లు కెప్టెన్‌గా జట్టును నడిపించిన హర్మన్ ప్రీత్.. ఇక నుంచి జట్టులో సీనియర్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగనుంది. తన సహచర ప్లేయర్ మంధాన నేతృత్వంలో పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడనుంది. ఇన్నాళ్లు కెప్టెన్ హోదాలో ఆమె ఆడినా, ఆడకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇకపై పరిస్థితులు వేరు కావడంతో బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌పై భారీ అంచనాలుంటాయి. జట్టులో నిలదొక్కుకోవాలంటే హర్మన్ తన స్థాయికి మించి ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. లేదంటే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం.

ఇదీ చదవండి: ‘నా కల నెరవేరింది.. అతడొక అద్భుతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement