
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హాండ్రడ్ లీగ్-2025ను అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ ఖాన్.. మంగళవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తాచాటాడు.
తన 20 బంతుల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 650 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ చరిత్ర సృష్టించాడు. రషీద్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 478 ఇన్నింగ్స్‌లలో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట నాలుగు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి.
26 ఏళ్ల రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడుతుంటాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025లో మాత్రం ఈ అఫ్గానీ దారుణంగా విఫలమయ్యాడు. 15 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్‌పై 6 వికెట్ల తేడాతో ఇన్విన్సిబుల్స్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. ఇన్విన్సిబుల్స్ బౌలర్లు రషీద్ ఖాన్, సామ్ కర్రన్ (19-10-18-3), జోర్డన్ క్లార్క్ (10-6-8-2) చెలరేగడంతో 80 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇన్విన్సిబుల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: Mohammad Siraj: సిరాజ్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?