
గత మూడు రోజులుగా సిరాజ్ పేరు మార్మోగిపోతోంది. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అతడిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఏమాత్రం విజయావకాశాలు లేని పరిస్థితిలో జట్టును గెలిచిపించి ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ పతాక శీర్షికలకు ఎక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థుల పనిపట్టి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడంలో కీరోల్ పోషించిన సిరాజ్‌కు అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంగ్లీషు గడ్డపై సత్తా చాటి తానేంటో మరోసారి రుజువు చేసి.. భళా అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ సంబంధించిన అన్ని అంశాలు మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. అతడి సంపాదన గురించి కూడా.
గ్రేడ్ A ప్లేయర్
టీమిండియా టాప్ బౌలర్లలో ఒకడైన మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ A ప్లేయర్‌గా ఉన్నాడు. దీనికి ప్రకారం అతడికి 5 కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుతుంది. రిటైనర్‌తో పాటు, అతడు ఆడే ప్రతి మ్యాచ్‌కూ ఫీజు కూడా దక్కుతుంది. టెస్ట్‌కు రూ.15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు టి20కి రూ.3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బోనస్ కూడా అందుకోబోతున్నాడు. ఎందుకంటే బాగా ఆడిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ బోనస్ ఇస్తోంది. ఉదాహరణకు 5 వికెట్ల తీసిన ఆటగాడికి 5 లక్షల రూపాయలు బోనస్‌గా అందజేస్తుంది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ మియా రెండు సార్లు ఐదు వికెట్ల పదర్శన నమోదు చేశాడు.
ఐపీఎల్‌తో అదుర్స్
నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లకు బీసీసీఐ భారీగానే జీతాలు ఇస్తోంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా మరింత సంపాదిస్తున్నారు టీమిండియా ప్లేయర్స్. ఐపీఎల్ మెగా వేలంలో సిరాజ్ భారీ ధర పలికాడు. తాజా సీజన్‌లో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తం అతడి వార్షిక బీసీసీఐ జీతం (BCCI salary) కంటే రెట్టింపు కావడం గమనార్హం.
'బ్రాండ్' బాజా
ఆటతో వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా సిరాజ్ సంపాదిస్తున్నాడు. మై 11 సర్కిల్, థంబ్స్ అప్, కాయిన్ స్విచ్ కుబేర్, ఎజీ క్రికెట్, నిప్పన్ పెయింట్స్, మై ఫిట్‌నెస్ వంటి హై-ప్రొఫైల్ బ్రాండ్‌లకు ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌లో రెస్టరెంట్ కూడా ప్రారంభించాడు.
నికర విలువ
2019 నుంచి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. నిలకడగా ఆడుతూ టీమ్‌లో టాప్ ప్లేయర్‌గా ఎదిగాడు. వివిధ మీడియా నివేదికల ప్రకారం.. అతడి మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 57 కోట్లుగా అంచనా. ఇందులో బీసీసీఐ, ఐపీఎల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాలు కూడా ఉన్నాయి. కిందిస్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన మన హైద్రాబాదీ పేస్ బౌలర్ మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుందాం.
మళ్లీ ఎప్పడు?
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో రాణించి స్వదేశానికి పయమైన మహ్మద్ సిరాజ్.. మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్‌లో జరిగే టి20 ఆసియా కప్ 2025లో అతడు ఆడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. బుమ్రాతో పాటు సిరాజ్‌కు కూడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!
చదవండి: నువ్వు గొప్పోడివి సిరాజ్.. విరాట్ కోహ్లి సోదరి పోస్ట్ వైరల్