
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓవల్ టెస్టు (Oval Test)లో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా.. అతడు భారత్‌ను విజయతీరాలకు చేర్చడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా గెలుపునకు ఒక వికెట్ కావాల్సిన వేళ సిరాజ్ తనలోని అత్యుత్తమ బౌలర్‌ను వెలికితీసి అద్భుతం చేశాడు.
సూపర్ డెలివరీతో గస్ అట్కిన్సన్ (17)ను పదో వికెట్‌గా వెనక్కి పంపి.. ఇంగ్లండ్ ఆట కట్టించాడు. దీంతో ఆఖరిదైన ఐదో టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చడం విశేషం.
ఓ పొరపాటు.. తీవ్రమైన ఒత్తిడి
అయితే, ఓవల్ టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా సిరాజ్ కారణంగా పెద్ద పొరపాటే జరగింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. అనూహ్యంగా బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అవుట్ కావాల్సిన హ్యారీ బ్రూక్ సిక్సర్‌తో పండుగ చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతక్కొట్టి (98 బంతుల్లో 111) మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు.
అయితే, ఆఖరికి బ్రూక్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ తొలుత క్యాచ్ డ్రాప్ చేసినందుకు సిరాజ్‌పై విమర్శలు వచ్చాయి. అయినాసరే ఒత్తిడిని జయించిన సిరాజ్.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సిరాజ్ మియాపై ప్రశంసలు కురిపించారు. ఇక విరాట్ కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా సైతం సిరాజ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాయడం విశేషం.
సిరాజ్.. నువ్వు గొప్పోడివి
‘‘ఈ ఆట ఎల్లప్పుడూ అద్భుతమైన అనుభవాలను అందించడంలో విఫలం కాదు. ఆశావహ, సానుకూల దృక్పథంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ స్పూర్తిదాయక హీరోలు ఉన్నంత వరకు ఈ ఆట ఇలాకాక.. ఇంకెలా ఉంటుంది?! మహ్మద్ సిరాజ్.. నువ్వు గొప్పోడివి’’ అంటూ భావనా కోహ్లి ధింగ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. వైరల్ అవుతోంది.
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ గెలవగా.. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రా కాగా.. ఐదో టెస్టులో భారత్ గెలిచింది. ఓవల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్ నిలవగా.. భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.