రాణించిన రాహుల్‌.. హైదరాబాద్‌ స్కోరెంతంటే? | Rahul Radesh steers Hyderabad with gritty knock against Rajasthan | Sakshi
Sakshi News home page

రాణించిన రాహుల్‌.. హైదరాబాద్‌ స్కోరెంతంటే?

Nov 9 2025 8:47 AM | Updated on Nov 9 2025 8:53 AM

Rahul Radesh steers Hyderabad with gritty knock against Rajasthan

ఓపెనర్ల వైఫల్యంతో శుభారంభం కరువైన హైదరాబాద్‌ను మిడిలార్డర్‌ బ్యాటర్లు రాహుల్‌ రాదేశ్, కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో సొంతగడ్డపై రాజస్తాన్‌తో శనివారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (6), అభిరథ్‌ రెడ్డి (9) నిరాశపరిచారు. దీంతో 21 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది.

ఈ దశలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ హిమతేజ (68 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో జతకలిసిన కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత రాజస్తాన్‌ బౌలింగ్‌పై అవలీలగా పరుగులు సాధించడంతో తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. 

రెండో సెషన్‌ మొదలయ్యాక సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని రాహుల్‌ చహర్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 101 వద్ద హిమతేజను అవుట్‌ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వరుణ్‌ గౌడ్‌ అండతో రాహుల్‌ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

కానీ కాసేపటికే అతను కూడా పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో వరుణ్‌ (23; 2 ఫోర్లు) వికెట్‌ పారేసుకోవడంతో 150 పరుగుల వద్ద హైదరాబాద్‌ జట్టు ఐదో వికెట్‌ను కోల్పోయింది. రెండో సెషన్‌లో సగం వికెట్లను కోల్పోయిన జట్టును రాహుల్‌ రాదేశ్‌ ఆదుకున్నాడు. 

రోహిత్‌ రాయుడు (86 బంతుల్లో 47; 4 ఫోర్లు) కుదురుగా ఆడటంతో ఆరో వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. అర్ధసెంచరీకి చేరువైన రోహిత్‌ నిష్కమ్రించగా, రాహుల్‌ రాదేశ్‌ నిలకడను ప్రదర్శించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే దశలో సీవీ మిలింద్‌ (14; 2 ఫోర్లు) రూపంలో హైదరాబాద్‌ ఏడో వికెట్‌ను కోల్పోయినప్పటికీ తొలి రోజు ఆటలో సంతృప్తికర స్థాయిలో పరుగులు సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో అనికేత్, అశోక్‌ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆకాశ్, రాహుల్‌ చహర్, సచిన్‌ యాదవ్‌లకు తల ఒక వికెట్‌ దక్కింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement