PBKS vs CSK: ప్రియాంశ్‌ పటాకా | IPL 2025 Punjab Kings Win Over Chennai Super Kings By 18 Runs, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

PBKS Vs CSK: ప్రియాంశ్‌ పటాకా

Apr 9 2025 3:38 AM | Updated on Apr 9 2025 9:58 AM

Punjab Kings win over Chennai Super Kings

39 బంతుల్లోనే సెంచరీ చేసిన పంజాబ్‌ యువ బ్యాటర్‌

7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 పరుగులు  

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ గెలుపు  

‘కింగ్స్‌’ పోరులో చెన్నైపై పంజాబ్‌దే పైచేయి అయింది. యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య మెరుపులకు శశాంక్‌ సింగ్, యాన్సెన్‌ ఫినిషింగ్‌ టచ్‌ తోడవడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్‌’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! 

ముల్లాన్‌పూర్‌: యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్‌ 18వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్‌ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రియాంశ్‌ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్‌ సింగ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో యాన్సెన్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 

కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (9)తో పాటు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0), స్టొయినిస్‌ (4), నేహల్‌ వధేరా (9), మ్యాక్స్‌వెల్‌ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... రచిన్‌ (37; 6 ఫోర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పోరాడారు. 

ఫటాఫట్‌... 
ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి బంతికే పాయింట్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన ప్రియాంశ్‌ ఆర్య... రెండో బంతికి క్యాచ్‌ మిస్‌ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్‌లో మరో సిక్స్‌ బాదాడు. రెండో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ డకౌట్‌ కాగా... ఆర్య ఇంకో సిక్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్‌ తదుపరి ఓవర్‌లో శ్రేయస్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయగా... నాలుగో ఓవర్‌లో ఆర్య ‘హ్యాట్రిక్‌’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

స్టొయినిస్‌ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్‌ ఓవర్‌లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ ఒకే ఓవర్‌లో నేహల్‌ , మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్‌ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్‌ 13వ ఓవర్‌లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్‌లో ఆర్య ఔట్‌ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్‌ చక్కటి షాట్‌లతో పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు. 

39 ప్రియాంశ్‌ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్‌ (30 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో), మిల్లర్‌ (38 బంతుల్లో) ట్రావిస్‌ హెడ్‌ (39 బంతుల్లో) ముందున్నారు.  

స్కోరు వివరాలు 
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య (సి) శంకర్‌ (బి) నూర్‌ 103; ప్రభ్‌సిమ్రన్‌ (బి) ముకేశ్‌ 0; శ్రేయస్‌ (బి) ఖలీల్‌ 9; స్టొయినిస్‌ (సి) కాన్వే (బి) ఖలీల్‌ 4; నేహల్‌ (సి) ధోని (బి) అశ్విన్   9; మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) అశ్విన్   1; శశాంక్‌ (నాటౌట్‌) 52; యాన్సెన్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–2; ముకేశ్‌ 2–0–21–1; అశ్విన్   4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్‌ 3–0–32–1; పతిరణ 4–0–52–0. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (స్టంప్డ్‌) ప్రభ్‌సిమ్రన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 37; కాన్వే (రిటైర్డ్‌ అవుట్‌) 69; రుతురాజ్‌ (సి) శశాంక్‌ (బి) ఫెర్గూసన్‌ 1; దూబే (బి) ఫెర్గూసన్‌ 42; ధోని (సి) చహల్‌ (బి) యశ్‌ 27; జడేజా (నాటౌట్‌) 9; శంకర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–39–0; యశ్‌ 4–0–39–1; మ్యాక్స్‌వెల్‌ 2–0–11–1; యాన్సెన్‌ 4–0–48–0; ఫెర్గూసన్‌ 4–0–40–2; స్టొయినిస్‌ 1–0–10–0; చహల్‌ 1–0–9–0.

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ X  రాజస్తాన్‌  
వేదిక: అహ్మదాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement