ఆర్సీబీ స్టార్‌ క్రికెటర్‌పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు | Police Case Lodged Against RCB Cricketer Yash Dayal | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ స్టార్‌ క్రికెటర్‌పై లైంగిక​ వేధింపుల కేసు

Jul 8 2025 10:54 AM | Updated on Jul 8 2025 11:03 AM

Police Case Lodged Against RCB Cricketer Yash Dayal

ఆర్సీబీ స్టార్‌ క్రికెటర్‌ యశ్‌ దయాల్‌పై లైంగిక​ వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్‌ దయాల్‌పై లైంగిక​ వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్‌ స్టేషన్‌లో యశ్‌ దయాల్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌ 69 కింద యశ్‌పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్‌ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.

ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన యువతి దయాల్‌తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్‌తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

దయాల్‌ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్‌తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్‌కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

కాగా, 27 ఏళ్ల యశ్‌ దయాల్‌ను ఆర్సీబీ గత ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్‌ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్‌లో దయాల్‌ 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్‌లో దయాల్‌ మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

దయాల్‌ 2023 సీజన్‌లో రింకూ సింగ్‌కు బౌలింగ్‌ చేస్తూ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్‌ విరాట్‌ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement