
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్‌డెర్మాట్, ప్రస్తుత స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌లను వెనక్కు నెట్టాడు.
మెక్‌డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు.
ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్‌లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.
ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.