
ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ సహా దేశవాలీ టీ20 లీగ్‌లకు కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు.
35 ఏళ్ల స్టార్క్ 2024 టీ20 వరల్డ్‌కప్ నుంచి పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. స్టార్క్ ఆస్ట్రేలియా తరఫున పేసర్లలో (టీ20లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా (79) ఉన్నాడు. ఓవరాల్‌గా ఆడమ్ జంపా (130) తర్వాత ఆస్ట్రేలియా తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో స్టార్క్ 2021 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ దశను అనుభవించాడు. ఆ టోర్నీలో ఆసీస్ విజేతగా నిలిచింది. టీ20ల్లో ఆసీస్‌కు అదే తొలి వరల్డ్‌కప్.
టీ20 కెరీర్‌లో ప్రతి మ్యాచ్‌ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్‌కప్ హైలైట్‌గా ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్‌ను ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే, టెస్ట్‌లకే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు.
భారత పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. పై టోర్నీలకు ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండేందుకు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని తెలిపాడు. 2012లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన స్టార్క్ ఈ ఫార్మాట్‌లో 65 మ్యాచ్‌లు ఆడి 7.74 ఎకానమీతో పరుగులు సమర్పించుకుని 79 వికెట్లు తీశాడు.
కాగా, ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సంబంధించి ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా స్టార్క్ టీ20ల నుంచి తప్పుకున్నాడు.