
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్‌కు అతి భారీ విజయం నెదర్లాండ్స్‌పై (2023 వన్డే వరల్డ్‌కప్‌లో 309 పరుగుల తేడాతో) దక్కింది.
యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్‌ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.
మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్‌లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.