
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు స్పెషలిస్ట్
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆటలోని మూడు ఫార్మాట్ల నుంచి తప్పకుంటున్నట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 2010లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పుజారా... దశాబ్దానికి పైగా సాగిన తన కెరీర్‌లో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. టెక్నిక్‌కు పెట్టింది పేరైన 37 ఏళ్ల పుజారా కెరీర్‌లో 103 టెస్టులాడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లను విసిగించడంలో దిట్ట అయిన పుజారా... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కెరీర్‌లో 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. 2018–19లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పుజారా... 2020–21 దాన్ని నిలబెట్టుకోవడంలోనూ తన విలువ చాటుకున్నాడు.
2023లో చివరిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన పుజారా... ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా... దేశవాళీ మ్యాచ్‌లకు ఎప్పుడూ దూరంకాని పుజారా జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా... సెలెక్టర్లు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక తప్పుకోవడమే ఉత్తమమని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రశంసల వెల్లువ...
స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్‌తో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాదే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోగా... ఇప్పుడు పుజారా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఓవరాల్‌గా 21,301 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ‘నయా వాల్’గా గుర్తింపు పొందిన అతడు... మూడో స్థానంలో బరిలోకి దిగి ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన పుజారాకు అభినందనలు వెల్లువెత్తాయి.
‘నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లడం చూసినప్పుడల్లా ఎంతో ధైర్యంగా ఉండేది. ప్రశాంతంగా ఆడే తీరు టెస్టు క్రికెట్‌పై నీ ప్రేమను చూపించేది. చక్కటి టెక్నిక్, అంతకుమించిన ఓర్పు, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కుంటూ జట్టుకు వెన్నెముకగా నిలచేవాడివి. 2018లో ఆ్రస్టేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గడంలో నీ పాత్ర ఎంతో ఉంది. జీవితంలో కొత్త చాప్టర్ మరింత ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నా’ అని సచిన్ ట్వీట్ చేశాడు. టీమిండియా కోచ్ గంభీర్, మాజీ ఆటగాళ్లు యువరాజ్, సెహ్వాగ్, లక్ష్మణ్, కుంబ్లే, రవిశాస్త్రితో పాటు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం రహానే, గిల్, పుజారాకు అభినందనలు తెలిపారు.
అదే అతిపెద్ద గౌరవం...
అత్యున్నత స్థాయిలో భారత జెర్సీ ధరించడం... జాతీయ గీతం ఆలపించడం... బరిలోకి దిగిన ప్రతిసారీ వంద శాతం ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడం... ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ప్రతి దానికి ముగింపు అంటూ ఉంటుంది. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఇన్నాళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు. కెరీర్‌లో ఎదిగేందుకు వారు ఎంతో తోడ్పాటు అందించారు.
నా మెంటార్‌లు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురువు, ఇలా అందరి సహకారంతోనే ఈ స్థాయికి వచ్చా. సహచర క్రికెటర్లు, సహాయ సిబ్బంది తోడ్పాటు మరవలేనిది. రాజ్‌కోట్ నుంచి వచ్చిన ఓ కుర్రాడు భారత జట్టులో భాగం కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు దక్కాయి. వాటి ద్వారా ఎంతో అనుభవం సాధించా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి కుటుంబానికి మరింత సమయం కేటాయిస్తా. – వీడ్కోలు సందేశంలో పుజారా
స్టయిలే వేరు!
గంటల తరబడి క్రీజులో పాతుకుపోగల నైపుణ్యం... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల ఆత్మస్థయిర్యం! ఒత్తిడిని చిత్తు చేయగల దృఢ సంకల్పం... ప్రత్యర్థుల సహనాన్ని పరీక్షించగల మనోధైర్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం!!
క్రీజులో అడుగుపెట్టింది తడువు ఓ మహాయజ్ఞానికి పూనుకున్నట్లు... పిచ్, పరిస్థితులు, ప్రత్యర్థులు ఇలా వేటితో సంబంధం లేకుండా తన కర్తవ్యాన్ని వందకు రెండొందల శాతం నిర్వర్తించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ్రస్టేలియా గడ్డపై కంగారూ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినా... ఇంగ్లండ్ పిచ్‌లపై అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి వాళ్లు స్వింగ్‌తో ఊరించినా... వికెట్ విలువ గుర్తెరిగి ప్రత్యర్థులకు టీమిండియాకు మధ్య అడ్డుగోడలా నిలిచిన పుజారా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.
విరాట్ కోహ్లి లాంటి కవర్ డ్రైవ్‌లు, రోహిత్ శర్మ లాంటి పుల్ షాట్‌లు, రిషబ్ పంత్ వంటి ఫాలింగ్ హుక్ షాట్‌లు ఆడగల సామర్థ్యం లేకున్నా... కేవలం తన సహనంతోనే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఘనత పుజారాది. ఫోర్లు, సిక్స్‌ల రూపంలో కొలవలేని గొప్పతనం అతడిది. సెంచరీలు, డబుల్ సెంచరీలు వివరించలేని ఆటతీరు అతడిది. టి20లు రాజ్యమేలుతున్న తరుణంలోనూ సంప్రదాయ క్రికెట్‌కే పెద్దపీట వేస్తూ... సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన అతడి ఘనతలను స్ట్రయిక్‌రేట్‌తో సరితూచడం సాధ్యం కానిది.
2018–19లో ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలవడం వెనక దాగిఉన్న పుజారా అకుంఠిత దీక్షను లెక్కించేందుకు కొలమానాలు లేవనడం అతిశయోక్తి కాదు. 1258 బంతులు ఎదుర్కొన్న అతడు 521 పరుగులతో సిరీస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక 2021 బ్రిస్బేన్ టెస్టులో ఆ్రస్టేలియాపై అతడు కనబర్చిన పోరాటపటిమ ముందు ఎన్ని త్రిశతకాలైన దిగదుడుపే. తొలి ఇన్నింగ్స్‌లో 94 బంతులాడిన పుజారా... రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులు ఎదుర్కొని 56 పరుగులు సాధించిన వైనాన్ని ఏ క్రీడాభిమాని మరవగలడు.
అతడి వికెట్ పడగొట్టడం సాధ్యంకాని ఆసీస్ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో విజృంభించినా... వెన్నుచూపకుండా వికెట్ల ముందు వీరుడిలా నిలిచిన తీరును ఏ గణాంకాలతో లెక్కించగలం! ఒకటా రెండా... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎన్నో సార్లు విలువైన ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించిన పుజారా ఆటకు అల్విదా చెప్పాడు. అతడి స్థానాన్ని భర్తి చేసేదెవరో చూడాలి మరి! –సాక్షి క్రీడా విభాగం