
తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసి భావి భారత తారగా కీర్తించబడిన పృథ్వీ షా.. కొద్ది కాలానికే ఫామ్ కోల్పోయి, ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొని, వివాదాల్లో తలదూర్చి భారత క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు.ఈ క్రమంలోనే తనకు గుర్తింపునిచ్చిన ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు.
ముంబై తరఫున అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే మకాంను మహారాష్ట్రకు మార్చిన షా.. కొత్త జట్టు తరఫున పూర్వ వైభవాన్ని సాధించే పని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్రం మ్యాచ్‌లోనే (బుచ్చిబాబు టోర్నీలో ఛత్తీస్‌ఘడ్‌పై) సెంచరీ (140 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111) చేసిన షా.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు.
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 96 బంతుల్లో 9 సొగసైన బౌండరీల సాయంతో 66 పరుగులు చేశాడు. జట్టు మారాక ఆటతీరును కూడా మార్చుకున్న షా.. అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటూ మరోసారి టీమిండియా వైపు అడుగులు వేస్తున్నాడు.
చత్తీస్‌ఘడ్‌పై సెంచరీ తర్వాతే షాకు సీఎస్‌కే నుంచి పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. షా ఈ టోర్నీలో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. సీఎస్‌కే కాకపోతే మరే ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా దక్కించుకోవచ్చు. షాకు ఐపీఎల్ ద్వారా టీమిండియా ఎంట్రీ ఈజీ అవుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే ఆలౌటైంది. పృథ్వీ షా రాణించడంతో మహారాష్ట్ర ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 160 పరుగుల ఆధిక్యంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.