
టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇవాళ (ఆగస్ట్ 24) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లు పాతుకుపోవడం, ఫామ్ కోల్పోవడం వంటి కారణాల చేత గత రెండున్నరేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న పుజారా ఇవాళ సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
2010, అక్టోబర్ 9న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పుజారా.. 13 ఏళ్ల తన టెస్ట్ కెరీర్‌లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. 103 టెస్టుల్లో 43.60 సగటున 7195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సౌరాష్ట్రకు చెందిన 37 ఏళ్ల పుజారా భారత తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత పుజారా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. పుజారా బ్యాటింగ్ శైలి ద్రవిడ్‌ను పోలి ఉండటంతో అందరూ అతన్ని నయా వాల్ అని పిలిచే వారు.
పుజారాకు 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ సిరీస్‌లో పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సిరీస్‌లో మొత్తం 521 పరుగులు చేసిన అతను.. టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
రిటైర్మెంట్ నేపథ్యంలో పుజారా సాధించిన పలు అబ్బురపడే రికార్డులపై ఓ లుక్కేద్దాం
ఓ ఇన్నింగ్స్‌లో 500 పైచిలుకు బంతులను ఎదుర్కొన్న ఏకైక భారత ఆటగాడు
నిలకడకు మారు పేరైన పుజారా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో 2017 రాంచీ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్‌లో పుజారా ఏకంగా 525 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు.
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఇన్ని బంతులు ఎదుర్కొన్న ఆటగాడే లేడు. ఓ ఇన్నింగ్స్‌లో 500 పైచిలుకు బంతులను ఎదుర్కొన్న తొలి, ఏకైక భారత ఆటగాడిగా పుజారా చరిత్ర సృష్టించాడు.
SENA దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాల్లో భాగమైన భారత ఆటగాడు
పుజారా పేరిట ఓ ఘనమైన రికార్డు ఉంది. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక టెస్ట్ విజయాల్లో (11) భాగమైన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ విభాగంలో పుజారా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి, రహానే, పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, సిరాజ్ ఉన్నారు. వీరంతా SENA దేశాల్లో తలో 10 విజయాల్లో భాగమయ్యారు.
బీజీటీలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడు
ఓ బీజీటీ సిరీస్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత ఆటగాడిగా పుజారా పేరిట రికార్డు ఉంది. 2018-19 ఆసీస్ పర్యటనలో పుజారా ఏకంగా 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఆ సిరీస్‌లో భారత చారిత్రక విజయాన్ని సాధించింది.
ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఏకైక భారత ఆటగాడు
2017లో ఈడెన్ గార్డన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పుజారా ఐదు రోజులు బ్యాటింగ్ చేశాడు. గడిచిన 40 ఏళ్లలో ఏ భారత ఆటగాడు ఈ ఫీట్‌ను సాధించలేదు. గడిచిన 40 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.