
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండటంతో.. సాగర్ అందాలను చూసేందుకు ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.

దీంతో బుద్ధవనం, సాగర్ డ్యాం, విద్యుదుత్పాదన కేంద్రం, కొత్త బ్రిడ్జి, విజయ విహార్, లాంచీ స్టేషన్‌తో పాటు హోటళ్లు, లాడ్జీలు పర్యాటకులతో కిటకిటలాడాయి.

నదీ తీరం వెంట, బుద్ధవనం పరిసరాల్లో, పార్కుల్లో పర్యాటకులు సహపంక్తి భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపారు. సాగర్ సమీపంలోని ఎత్తిపోతల వద్ద కూడా పర్యాటకులు సందడి చేశారు.

సాగర్ డ్యాం దిగువన గల శివాలయం ఘాట్ నుంచి డౌన్ పార్కు ముత్యాలమ్మ గుడి వరకు.. అటు కొత్త బ్రిడ్జి నుంచి మాచర్ల రోడ్డు వరకు పర్యాటకులు తమ వాహనాలను రోడ్ల పైనే పెట్టడంతో ట్రాఫిక్ జాం అయ్యింది.

దీంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

















