
ఆర్సీబీ స్టార్ స్పిన్నర్ సుయాశ్ శర్మ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో ఔటర్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సుయాశ్.. నిన్న (ఆగస్ట్ 5) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో విజృంభించాడు. తన జట్టు 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సుయాశ్ మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఫలితంగా అతని జట్టు ప్రత్యర్థిని 14.3 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ చేసింది. పురానీ ఢిల్లీ పతనాన్ని శాశించడంలో సుయాశ్‌కు శౌర్య మాలిక్ (3-0-10-3) జత కలిశాడు. శివమ్ శర్మ, హర్ష్ త్యాగి తలో వికెట్ తీశారు. పురానీ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమర్థ్ సేథ్ (18), లలిత్ యాదవ్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అంతకుముందు ఔటర్ ఢిల్లీ.. ఉధవ్ మోహన్ (4-0-26-5) విజృంభించడంతో 148 పరుగులకే పరిమితమైంది. ఉధవ్ మోహన్‌తో పాటు రజ్‌నీశ్ దాదర్ (4-0-22-2), పర్దీప్ పరాషార్ (3-0-11-2) రాణించారు. ఔటర్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సనత్ సాంగ్వాన్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సిద్దాంత్ శర్మ (21), వరున్ యాదవ్ (18), ధృవ్ సింగ్ (19), హర్ష్ త్యాగి (17) రెండంకెల స్కోర్లు చేశారు.
ఐపీఎల్ సంచలనం, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (16) వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో ఆర్మ 26 పరుగులకే పరిమితమయ్యాడు.
వాస్తవానికి డీపీఎల్ 2025 ప్రారంభానికి ముందు నుంచి ప్రియాంశ్ ఆర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఆర్య మరోసారి సీన్ రిపీట్ చేస్తాడని అంతా ఆశించారు. డీపీఎల్ అరంగేట్రం సీజన్‌లో ఆర్య 67.56 సగటున, 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు.
ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు చేసి పంజాబ్ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.