
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఒక్కసారి టైటిల్ సాధించకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు అభిమానుల్లో మంచి క్రేజ్ కొనసాగింది. 2025 సీజన్‌లో తొలి సారి విజేతగా నిలవడంతో ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా ఆ జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్‌సీబీ టీమ్ విలువ అక్షరాలా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2306 కోట్లు).
ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను (సీఎస్‌కే) వెనక్కి నెట్టిన ఆర్‌సీబీ టాప్‌కు చేరింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచిన సీఎస్‌కే 235 మిలియన్ డాలర్లు (రూ. 2014 కోట్లు) విలువతో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ విలువను 242 మిలియన్ డాలర్లు (రూ. 2074 కోట్లు)గా బ్యాంక్ హూలీహాన్ లెక్కగట్టింది.
ఇతర ఐపీఎల్ జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 1946 కోట్లు) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 1320 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1209 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక వృద్ధి సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్ ఫైనల్‌కు చేరిన పంజాబ్ ఏకంగా 39.6 శాతం వృద్ధి సాధించింది.
మరో వైపు ఐపీఎల్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు)కు చేరింది.
అత్యంత విలువైన ఐపీఎల్ జట్లు
1) RCB - 269 మిలియన్లు (సుమారు రూ. 2306 కోట్లు)
2) MI - 242 మిలియన్లు (రూ. 2074 కోట్లు)
3) CSK - 235 మిలియన్లు (రూ. 2014 కోట్లు)
4) KKR - 227 మిలియన్లు (రూ. 1946 కోట్లు)
5) SRH - 154 మిలియన్లు (రూ. 1320 కోట్లు)
6) DC - 152 మిలియన్లు (రూ. 1303 కోట్లు)
7) RR - 146 మిలియన్లు (రూ. 1252 కోట్లు)
8) GT - 142 మిలియన్లు (రూ. 1217 కోట్లు)
9) PBKS - 141 మిలియన్లు (రూ. 1209 కోట్లు)
10) LSG - 122 మిలియన్లు (రూ. 1046 కోట్లు)