చరిత్ర సృష్టించిన ఆర్సీబీ | RCB becomes the First team to win 6 Consecutive matches in WPL history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

Jan 20 2026 3:04 PM | Updated on Jan 20 2026 3:10 PM

RCB becomes the First team to win 6 Consecutive matches in WPL history

మహిళల ఐపీఎల్‌లో (WPL) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. 

నిన్న (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్‌లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించింది. 

అంతకుముందు ఎడిషన్‌లో (2025) తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. 

లీగ్‌ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
తాజాగా గుజరాత్‌ జెయింట్స్‌పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్‌తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది.

నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, అనామక ప్లేయర్‌ గౌతమి నాయక్‌ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 

మంధన (26), రిచా ఘోష్‌ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2, రేణుకా సింగ్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్‌ (4-0-17-2), లారెన్‌ బెల్‌ (4-1-23-1), రాధా యాదవ్‌ (4-0-34-1), శ్రేయాంక పాటిల్‌ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్‌ (11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement