
ఏకైక అనధికారిక టెస్టులో 6 వికెట్లతో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు విజయం
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓవర్‌నైట్ స్కోరు 260/8తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత మహిళల ‘ఎ’ జట్టు 81.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు భారత జట్టు క్రితం రోజు స్కోరుకు 26 పరుగులు జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో అమీ ఎడ్గర్ 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం 281 పరుగుల లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు 85.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. రాచెల్ ట్రెనామన్ (143 బంతుల్లో 64; 6 ఫోర్లు), మ్యాడీ డార్క్ (116 బంతుల్లో 68; 6 ఫోర్లు), అనికా లిరాయ్డ్ (125 బంతుల్లో 72; 9 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
కెప్టెన్ తహిలా విల్సన్ (104 బంతుల్లో 46; 4 ఫోర్లు) సైతం రాణించింది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకుంది.