
టీమిండియాలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారాడు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh). ముఖ్యంగా టీ20లలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరొందిన 26 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్... ఇటీవలే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్‌లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా చరిత్ర లిఖించాడు.
అత్యధిక వికెట్లు వీరుడిగా..
కేవలం 64 ఇన్నింగ్స్‌లోనే వంద వికెట్లు సాధించిన అర్ష్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2022లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 65 టీ20లు, 9 వన్డేలు ఆడిన ఈ పంజాబీ ఆటగాడు.. ఆయా ఫార్మాట్లలో 101, 14 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు అర్ష్‌దీప్ ఎంపికైనా.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. తదుపరి ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా వన్డే, టీ20లలో అర్ష్ బిజీకానున్నాడు. ఈ నేపథ్యంలో బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రాతో పాటు పాక్ దిగ్గజానికి క్రెడిట్ ఇచ్చిన అర్ష్‌దీప్
బౌలర్‌గా తాను విజయవంతం కావడానికి టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ కారణమని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు. బుమ్రాతో డ్రెసింగ్‌రూమ్ షేర్ చేసుకోవడం తనకు దక్కిన ఆశీర్వాదమంటూ హర్షం వ్యక్తం చేశాడు. తన బౌలింగ్ శైలికి కారణం బుమ్రానే అని తెలిపాడు.
అదే విధంగా.. ‘‘యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న లెఫ్టార్మ్ పేసర్ల వీడియోలన్నీ చూసేశాను. ఒక్కరి వీడియో కూడా మిస్ కాలేదు. యార్కర్లు చూడాలనిపిస్తే.. కచ్చితంగా వసీం అక్రం వీడియోలే చూస్తాను. అందులో ఆయన దృష్టి మొత్తం స్టంప్స్‌పై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.
ఆ ఇద్దరు కూడా..
ఇన్-స్వింగర్లు, రివర్స్ స్వింగర్లను బాగా ఆస్వాదిస్తా’’ అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌తో పాటు శ్రీలంక పేస్ లెజెండ్ లసిత్ మలింగల వీడియోల ద్వారా ఒకే శైలిలో భిన్నంగా ఎలా బంతులు సంధించాలో తెలుకున్నానని అర్ష్‌దీప్ తెలిపాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్