IND vs AUS: వారెవ్వా.. సెంచరీతో అదరగొట్టిన సాయి సుదర్శన్‌ | IND A vs AUS A: Sai Sudharsan Slams Century Continues Super Form | Sakshi
Sakshi News home page

IND vs AUS: సెంచరీతో అదరగొట్టిన సాయి సుదర్శన్‌.. టెస్టుల్లో ఫిక్స్‌ అన్న అగార్కర్‌

Sep 26 2025 1:18 PM | Updated on Sep 26 2025 1:39 PM

IND A vs AUS A: Sai Sudharsan Slams Century Continues Super Form

సాయి సుదర్శన్‌ (PC: X)

టీమిండియా యువ క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు (IND A vs AUS A)తో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌-‘ఎ’ తరఫున ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ అదరగొట్టాడు. రెండు అర్ధ శతకాలు బాదడంతో పాటు.. సెంచరీతోనూ సత్తా చాటాడు.

సెంచరీతో అదరగొట్టిన సాయి సుదర్శన్‌
లక్నోలోని ఏకనా స్టేడియంలో తొలి అనధికారిక టెస్టులో సాయి సుదర్శన్‌ 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, కూపర్‌ కన్నోలి బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరగడంతో అతడి ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

ఇక అదే వేదికపై ఆసీస్‌-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టులోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌​ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ 140 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 75 పరుగులు చేశాడు. అయితే, ఈసారి కూడా అతడు లెగ్‌ బిఫోర్‌గా వెనుదిరగడం గమనార్హం. టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆటలో సాయి సుదర్శన్‌ 172 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టి 100 పరుగులు సాధించాడు. అయితే, ఆ వెంటనే క్యారీ రొచిసిల్లి బౌలింగ్‌లో కాంప్‌బెల్‌ కెల్లావేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఆస్ట్రేలియా- ‘ఎ’ సిరీస్‌లో మొత్తంగా 248 పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సాయి సుదర్శన్‌ ఇలా సత్తా చాటడం ద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో మూడోస్థానంలో తన స్థానం సుస్థిరం చేసుకునే క్రమంలో కీలక ముందడుగు వేశాడు.

అతడికి మరిన్ని అవకాశాలిస్తామన్న అగార్కర్‌
కాగా టెస్టుల్లో వన్‌డౌన్‌ బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ పాతుకుపోయేట్లుగానే కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘టెస్టుల్లో మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం’’ అని అగార్కర్‌ స్పష్టం చేశాడు.

తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్‌ 23 ఏళ్ల సాయి సుదర్శన్‌ 2023లో వన్డేల్లో, 2024లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇటీవలే అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 140 పరుగులు సాధించాడు.

రాహుల్‌, సాయి శతకాలతో..
ఇక భారత్‌- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మ్యాచ్‌ విషయానికొస్తే.. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌ (100) శతకాల కారణంగా విజయం దిశగా సాగుతోంది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో శుక్రవారం 79 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి.. విజయానికి 95 పరుగుల దూరంలో ఉంది. రాహుల్‌ 131, కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: IND Vs PAK: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. అతడొక అద్భుతం.. మా ఫీల్డింగ్‌ సూపర్‌: పాక్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement