
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా పాకిస్తాన్ ఖరారైంది. దుబాయ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కిన పాక్.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబరు 28) భారత జట్టుతో ఫైనల్లో (IND vs PAK In Final) తలపడేందుకు సిద్ధపడింది.
135 పరుగులు
కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (4), ఫఖర్ జమాన్ (13) నిరాశపరచగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) 19 పరుగులు చేయగా.. హుసేన్ తలట్ 3 పరుగులకే నిష్క్రమించాడు.
Mustafizur Rahman sends the Pakistan captain packing 💨☝️
Watch #PAKvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/bkPfVMxULa— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ 23 బంతుల్లో 31, మొహమ్మద్ నవాజ్ 15 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా పేసర్ షాహిన్ ఆఫ్రిది 13 బంతుల్లో 19 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది.
రాణించిన పాక్ బౌలర్లు
బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులే చేసింది. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు దాటాడు.
పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు కూల్చి సత్తా చాటగా.. సయీమ్ ఆయుబ్ రెండు, మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
అతడి బౌలింగ్ అద్భుతం
ఇక బంగ్లాదేశ్‌పై విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తాము ఆదివారం నాటి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
‘‘ఇలాంటి మ్యాచ్‌లలో గెలిచామంటే మేమొక ప్రత్యేక జట్టు అనే చెప్పవచ్చు. మా జట్టులోని ప్రతి ఒక్కరు మెరుగ్గా ఆడారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మేము మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ దిశగా మేము ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాము కూడా!
షాహిన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఏదేమైనా మేము ఇంకో 15 పరుగులు చేసి ఉంటే విజయం సులభమయ్యేది.
ఏ జట్టునైనా ఓడించగలము
అయితే, మా బౌలర్లు గొప్పగా రాణించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనుకున్న ఫలితం రాబట్టారు. ఇక మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. మా కోచ్ కఠినంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎక్స్‌ట్రా సెషన్స్ పెడుతున్నారు.
హెడ్‌కోచ్ మైక్ హసన్.. ‘ఫీల్డింగ్ చేస్తేనే మీకు జట్టులో స్థానం ఉంటుంది’ అని చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో మా వాళ్లు అంత కఠినంగా ఉంటున్నారు. మా జట్టు ప్రస్తుతం గొప్పగా ఉంది. మేము ఏ జట్టునైనా ఓడించగలము. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇది చేసి చూపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాపై నామ మాత్రపు గెలుపు సాధించినందుకే ఇంత అతి వద్దంటూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చే స్తున్నారు.
టీమిండియా చెత్త ఫీల్డింగ్
కాగా లీగ్ దశలో అజేయంగా ఉండి సూపర్-4 చేరిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ చేరింది. అయితే, ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా.. ఏకంగా 12 క్యాచ్‌లు డ్రాప్ చేసింది.
మరోవైపు.. పాక్ కేవలం నాలుగు క్యాచ్‌లు మాత్రమే నేలపాలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న సూర్యసేన.. ఫీల్డింగ్ తప్పిదాలు సరిచేసుకుంటేనే విజయం నల్లేరు మీద నడక అవుతుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్