
కేఎల్ రాహుల్ (PC: X)
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుత శతకంతో మెరిశాడు. భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ (IND A vs AUS A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా.. భోజన విరామ సమయానికి 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. జట్టును విజయం దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా భారత్-‘ఎ’ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. లక్నోలో మంగళవారం మొదలైన ఈ నాలుగు రోజుల టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ లక్ష్యం 412
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్- ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత 194 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. ఈసారి మాత్రం భారత బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది.
46.5 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ లక్ష్యం 412 (226+185) పరుగులుగా మారింది. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 41 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్
ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు జతైన దేవ్‌దత్ పడిక్కల్ (5) పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన స్పిన్నర్ మానవ్ సుతార్.. శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వెనుదిరిగాడు.
తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి శతకం పూర్తి
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. 143 బంతుల్లో పన్నెండు ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. 44 పరుగులతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన సాయి సుదర్శన్ (98 బ్యాటింగ్) కూడా శతకానికి చేరువయ్యాడు. దీంతో భోజన విరామ సమయానికి భారత్ 66 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.
భారత్ విజయానికి ఇంకా 151 పరుగులు అవసరం కాగా.. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇక ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో అక్టోబరులో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్‌తో పాటు.. సాయి సుదర్శన్ ఎంపికైన విషయం తెలిసిందే.
అప్‌డేట్: లంచ్ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్ ఆ వెంటనే అవుటయ్యాడు.
చదవండి: IND vs WI: కరుణ్ నాయర్‌పై వేటు