
అభిమన్యు ఈశ్వరన్‌కూ దక్కని చోటు
దేవదత్ పడిక్కల్‌కు పిలుపు
నితీశ్ కుమార్ రెడ్డిపునరాగమనం
వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
దుబాయ్: ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులకే పరిమితమైన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా... స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండనున్నాడు. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా అక్టోబర్ 2 నుంచి టీమిండియా... వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... అంతా ఊహించినట్లే జట్టు ఎంపిక సాగింది.
దేశవాళీల్లో రాణించి ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించి దేవదత్ పడిక్కల్‌కు అవకాశమిచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో 9 ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ నాయర్ ఒక్క అర్ధశతకం మాత్రమే చేసి నిరాశ పరిచాడు.
రెగ్యులర్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్ ఓపెనర్, బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ను ఇక ఎంపిక చేయబోమని సెలెక్టర్లు సంకేతాలు పంపారు. గత మూడు నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పయనిస్తున్న ఓపెనర్ ఈశ్వరన్‌కు ఇక అవకాశాలు రావడం కష్టమే అని అగార్కర్ వెల్లడించాడు. వచ్చే ఏడాది కాలంలో భారత జట్టు విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు ఆడేది లేదు.
స్వదేశంలో మ్యాచ్‌లకు ఓపెనర్లతో పాటు రిజర్వ్‌గా నారాయణ్ జగదీశన్ అందుబాటులో ఉన్నాడు. దీనిపై అగార్కర్ మాట్లాడుతూ... ‘సాధారణంగా విదేశీ పర్యటనలకు 16, 17 మందితో జట్టును ఎంపిక చేస్తారు. అలాంటి సమయంలో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చక్కగా ఆడుతున్నారు. ఈ సమయంలో మూడో ఓపెనర్‌గా ఈశ్వరన్‌ను తీసుకొని అతడిని బెంచ్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ వరకు పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలున్నాయని అగార్కర్ తెలిపాడు.
షమీపై శీతకన్ను
సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా మైదానానికి దూరమైన అతడిని... ఇంగ్లండ్ పర్యటన సమయంలోనే జట్టులోకి తీసుకుంటారనుకుంటే... అప్పటికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని పక్కన పెట్టారు.
ఇక ఈ సిరీస్‌కైనా అతడు జట్టులో చోటు దక్కించుకుంటాడనుకుంటే అదీ సాధ్యపడలేదు. దీనిపై స్పందించిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్... ‘అతడి అంశంపై అప్‌డేట్ లేదు’ అని ముక్తసరిగా జవాబిచ్చాడు. అతడు ఇటీవలి కాలంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని... గత రెండు మూడేళ్లలో బెంగాల్ తరఫున ఒకటి, దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఆడినట్లున్నాడని అగార్కర్ అన్నాడు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు
భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కరుణ్ నాయర్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం. కానీ అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. పడిక్కల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. పోటీలో అతడు ముందున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌లకు ఇదే జట్టు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడని బుమ్రాకు ఆ తర్వాత కూడా తగినంత విశ్రాంతి లభించింది. దీంతో అతడు రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. –అజిత్ అగార్కర్, చీఫ్ సెలెక్టర్