IND vs AUS: విజయానికి 243 పరుగుల దూరంలో.. | IND A Vs AUS A 2nd Unofficial Test Day 3 Scores: India A need 243 Runs To Win, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: విజయానికి 243 పరుగుల దూరంలో..

Sep 26 2025 8:53 AM | Updated on Sep 26 2025 9:19 AM

IND A vs AUS A 2nd Unofficial Test Day 3 Scores: India A need 243 Runs To Win

లక్నో: భారత్- ఆస్ట్రేలియా ‘ఎ’ (IND A vs AUS A)జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు రసవత్తర ముగింపునకు చేరింది. మూడో రోజు ఆటలో ప్రత్యర్థిని 190 పరుగుల్లోపే ఆలౌట్‌ చేసిన భారత్‌ ‘ఎ’ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

తద్వారా విజయానికి 243 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లున్నాయి. మూడో రోజు ఆటలో ఇరుజట్లవి కలిపి 9 వికెట్లు కూలాయి. ముందుగా ఓవర్‌నైట్‌ స్కోరు 16/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 46.5 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ బ్యాటర్, కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీని (249 బంతుల్లో 85; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సహచరులు వెనుదిరుగుతున్నా... చక్కని పోరాటం చేశాడు. ఆరంభంలోనే హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ (Mohammed Siraj) పేస్‌కు 17 పరుగుల వద్ద కూపర్‌ కానొలి (1) రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జోష్‌ ఫిలిప్‌ (48 బంతుల్లో 50; 8 ఫోర్లు)తో కలిసి మెక్‌స్వీని ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వంద దాటింది.

ఈ దశలో సీమర్‌ గుర్నూర్‌ బ్రార్, స్పిన్నర్‌ మానవ్‌ సుథార్‌ (Manav Suthar) కంగారూ ఇన్నింగ్స్‌ను కోలుకోని విధంగా దెబ్బకొట్టారు. దీంతో 78 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను కోల్పోయి 200 పరుగుల్లోపే ఆలౌటైంది. గుర్నూర్, మానవ్‌ చెరో 3 వికెట్లు తీయగా... సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.  

రాహుల్‌ 74 రిటైర్డ్‌హర్ట్‌ 
అనంతరం 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్‌ ‘ఎ’కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul- 92 బంతుల్లో 74; 9 ఫోర్లు), జగదీశన్‌ (36; 5 ఫోర్లు) శుభారంభమిచ్చారు. 17 ఓవర్లలో 85 పరుగులు జోడించారు. 18వ ఓవర్‌ తొలి బంతికే జగదీశన్‌ అవుటవడంతో ఈ భాగస్వామ్యం చెదిరింది.

తర్వాత కూడా టీమిండియా సీనియర్‌ బ్యాటర్‌ అయిన రాహుల్‌... వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (84 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మరో భాగస్వామ్యానికి తెరలేపాడు. కానీ అర్ధసెంచరీ అనంతరం రాహుల్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత దేవదత్‌ పడిక్కల్‌ (5) నిరాశపరచగా, మానవ్‌ సుతార్‌ (1 బ్యాటింగ్‌) సుదర్శన్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. టాడ్‌ మర్ఫీ 2 వికెట్లు తీశాడు. తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టే సిరీస్‌ను దక్కించుకుంటుంది.  

సంక్షిప్త స్కోర్లు 
👉ఆస్ట్రేలియా ‘ఎ’ తొలిఇన్నింగ్స్‌: 420
👉భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 194
👉ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 185 (మెక్‌స్వీని 85; గుర్నూర్‌ బ్రార్‌ 3/42, సిరాజ్‌ 2/20). 
👉భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 169/2 (కేఎల్‌ రాహుల్‌ రిటైర్డ్‌హర్ట్‌ 74, సాయిసుదర్శన్‌ 44).  

చదవండి: Asia Cup 2025: భారత్‌ ప్రత్యర్థి పాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement