
దాయాదుల మధ్యే ‘ఆసియా కప్’ పోరు
కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్తాన్
ఆదివారం టైటిల్ సమరం
దుబాయ్: ‘చేతులు’ కలుపుకోలేని దాయాదులే టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్‌తో అమీతుమీకి పాకిస్తాన్ అర్హత సంపాదించింది. ఆదివారం ఈ తుది సమరం జరుగుతుంది. ఓవరాల్ ‘ఆసియా’ కప్ చరిత్రలో ఇరుజట్లు తొలిసారి ఫైనల్లో పోటీపడనున్నాయి. సెమీస్ కానీ సెమీస్‌ను తలపించిన సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. సాధారణంగా విధ్వంసరచన చేసే టి20 ఫార్మాట్‌ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి.
ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హరిస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. షాహిన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా, సయీమ్ అయూబ్‌కు 2 వికెట్లు దక్కాయి.
బ్యాటింగ్‌లో తడబడి... బౌలింగ్‌తో గట్టెక్కి
పాకిస్తాన్ బ్యాటింగ్‌లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు ఫర్హాన్ (4), ఫఖర్ జమన్ (13), సయీమ్ అయూబ్ (0) చేతులెత్తేశారు. తర్వాత తలత్ (3) కూడా వారిని అనుసరించగా, కెపె్టన్ సల్మాన్ ఆగా (23 బంతుల్లో 19; 2 ఫోర్లు), మొహమ్మద్ హరిస్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. నవాజ్ (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), షాహిన్ అఫ్రిది (13 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) 20 ఓవర్ల కోటా ఆడేందుకు దోహదపడ్డారు.
బంగ్లా బౌలర్లు పాక్‌ను ఎలా దెబ్బకొట్టారో అదే బౌలింగ్ ఆయుధంతో పాకిస్తాన్ కూడా బంగ్లాను వణికించింది. షాహిన్ అఫ్రిది ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ (0)ను... కాసేపటికి వన్‌డౌన్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (5)ని అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ సైఫ్ హసన్ (18)ను రవూఫ్, మెహదీ హసన్ (11)ను నవాజ్ అవుట్ పెవిలియన్ చేర్చడంతో 44 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది.
షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్‌లు) ఆశలు రేపినా... షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తుంచేశాడు. కెపె్టన్ జాకిర్ అలీ (5), తంజిమ్ హసన్ (10), తస్కిన్ అహ్మద్ (4)లు కూడా పాక్ బౌలర్లకు తలవంచడంతో వందలోపే (97/8) ఎనిమిది వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది.