
బెంగళూరు: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమిండియా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. మొదట న్యూజిలాండ్ జట్టు 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించగా... ఆ తర్వాత మరో రెండు ఓవర్లు తగ్గించారు.
కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ (54 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మ్యాడీ గ్రీన్ (49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (40; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఆంధ్ర స్పిన్నర్ శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత లక్ష్యాన్ని 42 ఓవర్లలో 237 పరుగులుగా నిర్ణయించగా... హర్మన్ బృందం 40.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
హర్లీన్ డియోల్ (79 బంతుల్లో 74; 10 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (86 బంతుల్లో 69; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. గువాహటి వేదికగా మంగళవారం జరగనున్న ప్రపంచకప్ తొలి పోరులో శ్రీలంకతో భారత్ తలపడనుంది.