
టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టకేలకు ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుది. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్ లీగ్, సూపర్-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.
అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.
హ్యాట్రిక్ డకౌట్లు
ఒమన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సయీమ్ ఆయుబ్.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సూపర్-4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో 21 పరుగులు చేయగలిగాడు.
ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ పరంగా విఫలమైనా పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ఏడు వికెట్లు తీయగలిగాడు.
భవిష్యత్ ఆశాకిరణం
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సయీమ్ ఆయుబ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్ అయినపుడే.. బెంచ్‌కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.
అతడు టాలెంటెడ్ ప్లేయర్. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వీక్‌గా అనిపిస్తోంది.
ఇలాంటపుడు బెంచ్‌కే పరిమితం చేయాలి
బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం.
ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు. కాగా భారత్- పాకిస్తాన్ ఆసియా కప్-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్.
చదవండి: ఆసియా కప్: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు