
టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ఆట తీరును భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) విమర్శించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అతడి టెక్నిక్ సరిగ్గా లేదని.. తప్పులు సరిచేసుకోవాలని సూచించాడు. తన బౌలింగ్‌లో ప్రత్యర్థులు చితక్కొడుతున్నా మూస పద్ధతిలో వెళ్లడం సరికాదంటూ మండిపడ్డాడు.
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఆడే భారత జట్టులో పేస్ బౌలర్ల కోటాలో.. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)తో పాటు హర్షిత్ రాణా స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఈ టీ20 టోర్నీలో ఇప్పటికి టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌లలో.. అతడికి కేవలం రెండు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.
26 పరుగులు
తొలుత లీగ్ దశలో భాగంగా ఆఖరిగా ఒమన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో హర్షిత్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో 13 పరుగులతో అజేయంగా నిలిచిన హర్షిత్.. బౌలింగ్ పరంగానూ ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
ఎక్స్‌పెన్సివ్ బౌలింగ్
అయితే, తాజాగా.. శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో మాత్రం హర్షిత్ తేలిపోయాడు. అతడి బౌలింగ్‌లో లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక చితక్కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 54 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశాడు.
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘హర్షిత్ రాణా గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అవును.. అతడికి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వేరే వారి కోసం అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.
ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా?
ఇలా జట్టులోకి వస్తూ పోతూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. లయ కూడా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్‌లో.. ఒకటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇంకోటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇలా పరిణతి లేకుండా సాగిపోయింది అతడి బౌలింగ్.
ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశూ సుతిమెత్తగానే చురకలు అంటించాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం మరింతగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించాడు.
కాగా శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో గెలిచిన టీమిండియా అజేయంగా ఫైనల్‌లో ఆడనుంది. దుబాయ్‌లో దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా టైటిల్ కోసం ఆదివారం తలపడుతుంది.
చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’