
నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో వన్డే
మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: మహిళల వన్డే క్రికెట్‌లో భారత జట్టు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ్రస్టేలియా మహిళలపై సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం మన జట్టు ముందు నిలిచింది. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో చెలరేగి భారీ విజయాన్ని అందుకున్న హర్మన్‌ప్రీత్ బృందం అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లాగే సత్తా చాటితే తొలిసారి టీమిండియా సిరీస్ మన ఖాతాలో పడుతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య నేడు నిర్ణయాత్మక మూడో వన్డేకు రంగం సిద్ధమైంది.
వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌లో ఆడిన ఇరు జట్లు విజయంతో ముగించి మెగా ఈవెంట్‌లో అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. రెండో వన్డేలో స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్‌తో పాటు పదునైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారత్ కట్టడి చేసింది. ఫలితంగా ఆసీస్ వన్డే చరిత్రలో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసింది. అయితే మన జట్టులో కూడా ఫీల్డింగ్ రూపంలో ప్రధాన లోపం కనిపిస్తోంది.
రెండు వన్డేల్లో కలిపి మన ప్లేయర్లు ఏకంగా 10 క్యాచ్‌లు వదిలేశారు. దీనిని సరిదిద్దుకోవాల్సి ఉంది. భారత తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మరో వైపు గత మ్యాచ్‌లో ఓడినా...ఆ్రస్టేలియాను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అలీసా హీలీ టీమ్ రెండో వన్డే పరాజయాన్ని మరచి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని, సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది.