నిజమే!.. ‘ప్రియురాలి’తో హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్‌ | Hardik Pandya Spotted With His Rumoured Girlfriend Model Mahieka Sharma At Mumbai Airport Video Trending | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఒకేలా ఉన్నారే!.. ‘ప్రియురాలి’తో హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్‌

Oct 10 2025 1:52 PM | Updated on Oct 10 2025 1:57 PM

Hardik Pandya spotted with model Mahieka Sharma at Mumbai airport Video

మహీకతో హార్దిక్‌ (PC: Instagram)

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా గాయపడిన అతడు.. ​ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.

ఈ క్రమంలో తనకు దొరికిన విరామ సమయాన్ని హార్దిక్‌ పాండ్యా ‘ప్రియురాలి’తో గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బరోడా ఆల్‌రౌండర్‌ గతంలో నటాషా స్టాంకోవిక్‌ అనే సెర్బియా మోడల్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే కుమారుడు అగస్త్యకు ప్రాణం పోసిన ఈ జంట.. కోవిడ్‌ సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ దండలు మార్చుకున్నారు.

కుమారుడు జన్మించిన మూడేళ్లకు అంటే.. 2023, ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో హార్దిక్‌- నటాషా మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ- క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.

విడాకులు తర్వాత హార్దిక్‌- నటాషా కుమారుడు అగస్త్య బాధ్యతను సమంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్‌.. సింగర్‌ జాస్మిన్‌ వాలియాతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమెతోనూ కటీఫ్‌ చెప్పిన హార్దిక్‌.. మోడల్‌ మహీక శర్మతో డేటింగ్‌ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

ఇందుకు బలం చేకూరుస్తూ మహీకతో కలిసి ఒకే కారులో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన హార్దిక్‌.. ఆమె చేయిని పట్టుకుని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ నలుపు రంగు వస్త్రాల్లో.. ఒకే రకమైన జాకెట్‌ ధరించి.. వైట్‌ షూస్‌ వేసుకుని ట్విన్నింగ్‌ లుక్‌తో కనిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఇద్దరూ ఒకేలా ఉన్నారే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో విడాకుల సమయంలో నటాషాను అనవసరంగా తప్పుబట్టామని.. హార్దిక్‌ను వెనకేసుకువచ్చిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 31 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 94 వన్డేలు, 120 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. టెస్టుల్లో 532, వన్డేల్లో 1904, టీ20లలో 1860 పరుగులు సాధించడంతో పాటు.. ఆయా ఫార్మాట్లలో 17, 91, 98 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement