పరుగుల జోరులో కివీస్‌దే పైచేయి | Pakistan Lost By Five Wickets | Sakshi
Sakshi News home page

పరుగుల జోరులో కివీస్‌దే పైచేయి

Sep 30 2023 3:00 AM | Updated on Sep 30 2023 3:00 AM

Pakistan Lost By Five Wickets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఊహించినట్లుగానే ఉప్పల్‌ స్టేడియం భారీ స్కోర్లకు వేదికైంది. బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉన్న పిచ్‌పై పాకిస్తాన్, న్యూజిలాండ్‌ జట్లు పరుగుల వరద పారించాయి. అయితే చివరకు ఛేదనలో సత్తా చాటిన కివీస్‌దే పైచేయి అయింది. శుక్రవారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన తొలి వామప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94 బంతుల్లో 103 రిటైర్డ్‌హర్ట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), సౌద్‌ షకీల్‌ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. చివర్లో ఆగా సల్మాన్‌ (23 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్‌ 43.4 ఓవర్లలో 5 వికెట్లకు 346 పరుగులు సాధించి గెలిచింది.

రచిన్‌ రవీంద్ర (72 బంతుల్లో 97; 16 ఫోర్లు, 1 సిక్స్‌), మార్క్‌ చాప్‌మన్‌ (41 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), డరైల్‌ మిచెల్‌ (57 బంతుల్లో 59 రిటైర్డ్‌ నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేన్‌ విలియమ్సన్‌ (50 బంతుల్లో 54 రిటైర్డ్‌ నాటౌట్‌; 8 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. భద్రతా కారణాలతో పోలీసు యంత్రాంగం సూచనల కారణంగా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు. ఖాళీ మైదానంలో ఇరు జట్ల బ్యాటర్లు భారీ షాట్లు బాదారు. ఈ స్టేడియంలో అక్టోబర్‌ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య మరో వామప్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

తొలి మ్యాచ్‌కు విలియమ్సన్‌ దూరం
పాక్‌తో వామప్‌ మ్యాచ్‌లో సత్తా చాటినా... అసలు పోరు సమయానికి విలియమ్సన్‌ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. అందుకే అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌తో జరిగే వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు.    
శ్రీలంకకు బంగ్లాదేశ్‌ షాక్‌
గువహటి: మరో వామప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్లతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (68), ధనంజయ (55) అర్ధ సెంచరీలు చేయగా... మెహదీ హసన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్‌ 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు సాధించి నెగ్గింది.తన్‌జీద్‌ (84), మిరాజ్‌ (67 నాటౌట్‌), లిటన్‌ దాస్‌ (61) కలిసి జట్టును గెలిపించారు.  మరోవైపు తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement