‘ఇలాంటివి మన ఆడతనాన్ని దూరం చేయలేవు’ | Not The End of Our Innings: Anaya Bangar on ECB Ban on Trans Women | Sakshi
Sakshi News home page

ఇలాంటివి మన ఆడతనాన్ని దూరం చేయలేవు: ఈసీబీపై అనయ ఫైర్‌

May 3 2025 3:54 PM | Updated on May 3 2025 4:47 PM

Not The End of Our Innings: Anaya Bangar on ECB Ban on Trans Women

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కుమార్తె అనయా బంగర్‌ (Anaya Bangar) ఘాటుగా స్పందించింది. ట్రాన్స్‌జెండర్లను మహిళా క్రికెట్‌లో ఆడకుండా నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అంకిత భావం, ప్రతిభ, క్రమశిక్షణతో ఉండే వారిని కూడా ఆటకు దూరం చేయడం సరికాదని మండిపడింది.

ఇకపై వారికి అనుమతి లేదు
కాగా ఈసీబీ లింగమార్పిడి (ట్రాన్స్‌జెండర్లు) చేసుకున్న క్రికెటర్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇకపై మహిళలు, బాలికల క్రికెట్‌లో వారిని అనుమతించమని స్పష్టం చేసింది. ఈసీబీ నిర్ణయం తక్షణం అమలవుతుందని వెల్లడించింది. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఇటీవల సుప్రీమ్‌ కోర్టు మహిళలు, బాలికల క్రీడల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

తల్లిగర్భం నుంచే అమ్మాయిగా ఉన్న వారికి మాత్రమే
మహిళా అథ్లెట్ల ఔన్నత్యాన్ని పెంచేవిధంగా ఈ కోర్టు నిర్ణయాలు తీసుకుంది. దీన్ని వెంటనే అమలు చేసేందుకు ఈసీబీ సిద్ధమైంది. ‘తల్లిగర్భం నుంచే అమ్మాయిగా జన్మించిన ఆడబిడ్డలే ఇకపై బాలికలు (జూనియర్‌ స్థాయి), మహిళల (సీనియర్‌ స్థాయి) క్రికెట్‌లో ఆడేందుకు అర్హులు. 

లింగమార్పిడితో ఆడవారుగా మారిన క్రికెటర్లను అనుమతించం. అయితే ఈ ట్రాన్స్‌జెండర్లు ఓపెన్‌ లేదంటే మిక్స్‌డ్‌ క్రికెట్‌ ఆడుకోవచ్చు. కానీ మహిళల విభాగంలో పోటీపడేందుకు మాత్రం వీల్లేదు’ అని ఈసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ సంఘం (ఎఫ్‌ఏ) ఇలాంటి నిర్ణయమే తీసుకున్న 24 గంటల్లోపే ఈసీబీ కూడా ఎఫ్‌ఏను అనుసరించింది.  

ఈ నేపథ్యంలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీతో అమ్మాయిగా మారిన అనయా బంగర్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. ‘‘ఇది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు. ఇదొక సందేశం. మీకెంత ప్రతిభ ఉన్నా, అంకిత భావంతో ఆడుతున్నా.. ఏళ్లకు ఏళ్లుగా ఆటనే ప్రాణంగా భావిస్తూ ముందుకు సాగుతున్నా.. మీకు ఇక ఆ అర్హత లేదనే సందేశం.

ఇలాంటి సందేశాలు క్రికెట్‌ను ప్రేమించేవారిని బాధిస్తాయి. నేనొక ట్రాన్స్‌ గర్ల్‌ మాత్రమే కాదు. నేనో క్రికెటర్‌ని కూడా. వివక్ష, వేధింపులు.. ఇలా ఎన్నో ఆటంకాలు దాటిన తర్వాత ఇప్పుడిలా ఉన్నాను.

ఇలాంటివి మన ఆడతనాన్ని దూరం చేయలేవు
అయితే, ఇప్పుడు ఆటకు దూరం చేసేలా కొన్ని సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఇలాంటివేవీ ట్రాన్స్‌ గర్ల్స్‌, ట్రాన్స్‌ వుమన్‌ను తమ ఆడతనం నుంచి దూరం చేయలేవు. 

పిచ్‌ మన ఆధీనంలో ఉండకపోవచ్చు. కానీ స్పిరిట్‌ మనతోనే ఉంటుంది. మన ఇన్నింగ్స్‌కు ఇది ఎంతమాత్రం ముగింపు కాబోదు’’అని అనయా బంగర్‌ భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది.

కాగా టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పెద్ద కుమారుడైన ఆర్యన్‌ దేశీ క్రికెట్‌ ఆడాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ఖాన్‌లతో కలిసి ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, తనలోని స్త్రీత్వాన్ని గుర్తించి అమ్మాయిగా మారిపోయి.. అనయ అనే పేరుతో లండన్‌లో జీవిస్తున్నాడు.

చదవండి: క్రీడా గ్రామంలో కాదు... క్రూజ్‌ షిప్‌లో

Advertisement
 
Advertisement
Advertisement