
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ విజేతగా నిలిచి ఐదు రోజులు అవుతున్నప్పటికి ట్రోఫీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా మెడల్స్‌తో పాటు ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరిచింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌తో పాటు ఆ దేశ మంత్రిగా ఉండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నఖ్వీ ట్రోఫీని, మెడల్స్‌ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పటివరకు యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తన చేతుల మీదగా ట్రోఫీని తీసుకోకూడదనే వైఖరిని కొనసాగిస్తే, నఖ్వీని తన నిర్ణయాన్ని మార్చుకోవద్దని అలీ సూచించాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు.
"టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. కానీ వారు చేసే పనులు మాత్రం థర్డ్ క్లాస్‌ను తలపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీనే ఆసియాకప్ ట్రోఫీని అందజేయాలి. వారు అందుకు నిరాకరిస్తే, ఖచ్చితంగా ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు.
అటువంటి అప్పుడు ఎట్టిపరిస్థితిలలోనూ ట్రోఫీని అప్పగించకూడదు. భారత్ బాగా ఆడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మొండితనం ఏంటి? మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్‌గా ఉన్నారు. అదే ఐసీసీ ఈవెంట్ అయివుండి చైర్మెన్ జై షా నుండి పాకిస్తాన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించినా కూడా నేను తప్పు పట్టేవాడిని" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్‌ను భారత్ చిత్తు చేసింది. అయితే అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు, ముందు మీ జట్టు సంగతి చూసుకో అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: IND vs AUS: పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే?