
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్-ఎ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తమ నిర్ణయానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఇండియా-ఎ జట్టు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం విరోచిత పోరాటం కనబరిచాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
122 బంతులు ఎదుర్కొన్న తిలక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు రియాన్ పరాగ్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8)తో సహా అభిషేక్ శర్మ(0), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(1) వంటి స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్, సంఘా తలా రెండు వికెట్లు సాధించారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు దూకుడుగా ఆడుతున్నారు. 5.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్..