మాజీ భార్య హసీన్ జహాతో (Hasin Jahan) విభేదాల కారణంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లోకెక్కాడు. తనకు లభిస్తున్న భరణం సరిపోవట్లేదని హసీన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది.
హసీన్ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షమీ హసీన్‌కు రూ. 4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు. ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్‌కు రూ. 1.5 లక్షలు వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తం సరిపోవట్లేదని హసీన్ షమీపై మరోసారి కోర్టుకెక్కింది.
గతంలోనూ ఇదే విషయంలో ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హసీన్ తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తున్నాడు. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో వదిలేశాడు.
షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుంది. హసీన్‌కు స్వతంత్ర ఆదాయ వనరులేదు. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదని అన్నారు. షమీ తమ క్లయింట్‌కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించేది ఉందని తెలిపారు.
లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు హసీన్‌కు పరోక్షంగా చురకలంటించ్చినట్లు తెలుస్తుంది. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, షమీ-హసీన్‌ల వివాహం 2014లో జరిగింది. నాలుగేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరికి ఓ బిడ్డ జన్మించింది.
ఆతర్వాత షమీ-జహా మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో హసీన్ షమీపై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్‌కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్‌కు చెల్లించాలని షమీని ఆదేశించింది.
చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?


