ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్‌కు రంగం సిద్దమైంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఎస్‌ఆర్‌హెచ్-ఎల్‌ఎస్‌జీ మధ్య రూ. 10 కోట్ల 'ఆల్-క్యాష్ డీల్' (నగదు రూపంలో మాత్రమే చెల్లించి) ఫైనల్ అయినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది.
గత ఏడాది సీజన్ మెగా వేలంలో షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్‌లలో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన.
దీంతో అతడిని మినీ వేలంలో విడిచిపెట్టేందుకు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అంతలోనే షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ జట్టులో సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ఎల్‌ఎస్‌జీ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
లక్నో జట్టులో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లు ఉన్నప్పటికి.. వారు ఫిట్‌నెస్ సమస్యలతో సతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేసిన ఫోటోను లక్నో పోస్ట్ చేసింది. అయితే అందులో షమీ కన్పించకుండా ఎల్‌ఎస్‌జీ జాగ్రత్త పడింది.
ఆ నలుగురికి టాటా బైబై..
ఇక లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో తమ పర్స్ విలువను పెంచుకోవడానికి నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్‌లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్-2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫ్రాంచైజీలు శనివారం (నవంబర్ 15)సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి.
చదవండి: ‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్!


