‘అసలే మరుగుజ్జు కదా!’.. స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌! | South Africa Breaks Silence On Bauna Remark At Temba Bavuma By Bumrah Pant, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌!

Nov 14 2025 9:52 PM | Updated on Nov 15 2025 1:38 PM

South Africa Breaks Silence On Bauna Remark At Bavuma By Bumrah Pant

భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు శుక్రవారం తెరలేచింది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.

బంతితో అదరగొట్టిన బుమ్రా
ఈ క్రమంలో టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా ఆది నుంచే నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వేగంగా ఆడుతూనే.. క్రీజులో పాతుకుపోవాలని ప్రయత్నించిన ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (48 బంతుల్లో 31), రియాన్‌ రికెల్టన్‌ (22 బంతుల్లో 23)లను త్వరగానే పెవిలియన్‌కు పంపాడు.

అంతేకాదు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24), సైమన్‌ హార్మర్‌ (5), కేశవ్‌ మహరాజ్‌ (0)లను కూడా అవుట్‌ చేసిన బుమ్రా.. మొత్తంగా ఐదు వికెట్లతో మెరిశాడు. సఫారీలను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఈ రైటార్మ్‌ పేసర్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అదే సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమాను ఉద్దేశించి.. బుమ్రా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికా స్కోరు 62/2 వద్ద ఉన్న వేళ.. బవుమా క్రీజులో ఉండగా.. బుమ్రా అద్భుతమైన బంతిని సంధించాడు. దీనిని ఎదుర్కొనే క్రమంలో బవుమా డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్‌ అతడి ప్యాడ్‌కు తాకింది.

బుమ్రా నోట ఊహించని మాట
దీంతో బుమ్రాతో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా.. అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు. అయితే, బుమ్రా మాత్రం కచ్చితంగా బంతి వికెట్లను గిరాటేస్తుందన్న నమ్మకంతో .. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌తో చర్చించేందుకు వెళ్లాడు. బాల్‌ మరీ ఎత్తులో వెళ్లిందా? లేదా? అని చర్చించాడు. ఇందుకు పంత్‌.. బాల్‌ ఎత్తులోనే వెళ్తుందని అభిప్రాయపడ్డాడు.

అసలే మరుగుజ్జు కదా!
మరోవైపు.. బుమ్రా ఊహిస్తున్నట్లుగా ఇది అవుట్‌ కాదని భావించిన కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా రివ్యూ తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే బుమ్రా.. ‘క్రీజులో ఉన్నది అసలే మరుగుజ్జు కదా!’ అంటూ ఒక రకంగా బవుమాను ఎగతాళి చేస్తూ బౌలింగ్‌ చేసేందుకు వెళ్లాడు. దీంతో భారత ఆటగాళ్లంతా నవ్వుకోగా.. బుమ్రా మాటలు స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి.

నిజానికి బుమ్రా మైదానంలో ఇలా వ్యవహరించడం అరుదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి గురించి అతడు ఇలా మాట్లాడతాడని అభిమానులు కూడా అస్సలు ఊహించలేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు బుమ్రా తీరు సరికాదంటూ విమర్శల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం సరదాగా అన్న మాటలకు అపార్థాలు ఆపాదించవద్దని హితవు పలికారు.

స్పందించిన సౌతాఫ్రికా కోచ్‌!
ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ యాష్‌వెల్‌ ప్రిన్స్‌ తాజాగా స్పందించాడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాలేదు. అవును.. ఇలా జరగడం ఇదే తొలిసారి.

అందుకే త్వరగానే నా దృష్టికి కూడా వచ్చింది. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ అంటూ మాట దాటేశాడు. ఏదేమైనా బుమ్రా తీరుకు బవుమా, అతడి అభిమానులు నొచ్చుకున్నారన్నది మాత్రం నిజమేనని తెలుస్తోంది. 

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025 ఫైనల్లో.. బవుమా కెప్టెన్సీలోని సౌతాఫ్రికా టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సఫారీలు ఐసీసీ గదను సొంతం చేసుకున్నారు. 

చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌దే పైచేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement