వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్‌.. నాకౌట్‌కు ఫ్రాన్స్‌ | Kylian Mbappe-Scores 2 Goals-France Win-Over-Iraq Enters Knock Out | Sakshi
Sakshi News home page

వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్‌.. నాకౌట్‌కు ఫ్రాన్స్‌

Jun 23 2026 7:06 AM | Updated on Jun 23 2026 10:32 AM

Kylian Mbappe-Scores 2 Goals-France Win-Over-Iraq Enters Knock Out

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఫ్రాన్స్ జ‌ట్టు నాకౌట్ ద‌శ‌కు చేరుకుంది. గ్రూప్‌-ఐలో ఇరాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో విజ‌యాన్ని అందుకుంది. ఫ్రాన్స్ స్టార్ ఆట‌గాడు కైలియ‌న్ ఎంబాపె డ‌బుల్ గోల్స్ (ఆట 14, 54వ నిమిషం)తో మెరవ‌గా, ఓస్మ‌న్ డెంబ్లె (ఆట 60వ నిమిషం) మ‌రో గోల్ చేశాడు. ఈ విజ‌యంతో ఫ్రాన్స్ నాకౌట్‌కు అర్హ‌త సాధించింది. 

వ‌ర్షంతో మ్యాచ్ రెండు గంట‌లు ఆల‌స్యంగా మొద‌లైంది.  మ్యాచ్ ఆల‌స్యంగా మొద‌లైన‌ప్ప‌టికీ ఎంబాపె త‌న గోల్స్ కిక్‌తో అభిమానుల‌ను సంతోషంలో ముంచెత్తాడు. ఆట 14వ నిమిషంలో కార్న‌ర్ నుంచి బంతిని గోల్ పోస్టులోకి త‌ర‌లించిన ఎంబాపె ఫిఫాలో 15 వ గోల్ సాధించాడు. 

ఆ త‌ర్వాత రెండో హాఫ్‌లో 54వ నిమిషంలో మ‌రోసారి మెరిసిన ఎంబాపె రెండో గోల్ సాధించడంతో పాటు ఫ్రాన్స్‌ను 2-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేప‌థ్యంలో బాల‌న్ డీ ఓర్ అవార్డు విజేత ఓస్మ‌న్ డెంబ్లె 64వ నిమిషంలో గోల్ చేయ‌డంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మ‌రోవైపు 1986 త‌ర్వాత రెండో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న ఇరాక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మిపాలై టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

కాగా ఎంబాపె ఇరాక్‌తో మ్యాచ్ ద్వారా ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఎంబాపెకు ఇది వందో అంత‌ర్జాతీయ మ్యాచ్ కావ‌డం విశేషం. త‌న వందో అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపెకు ఫిఫాలో ఇది 16వ గోల్‌. త‌ద్వారా ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో ఎంబాపె.. జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరాస్లావ్ క్లోస్ (16 గోల్స్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంత‌క‌ముందు 15వ గోల్ కొట్టి బ్రెజిల్ దిగ్గ‌జం రొనాల్డో రికార్డును స‌మం చేశాడు. 

మెస్సీ వెనుకే ఎంబాపె..


ఇక ఫిఫా ప్రపంచకప్‌లో ఈసారి మెస్సీ, ఎంబాపె మధ్య నంబర్ గేమ్ నడుస్తోంది. ‘వస్తా నీ వెనుక’ అన్నట్లుగా మెస్సీకి పోటీగా ఎంబాపె వరుస గోల్స్‌తో రెచ్చిపోతున్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ 18 గోల్స్‌తో ఫిఫా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరాక్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి తన గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్న ఎంబాపె.. మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌లో మిరాస్లావ్ క్లోస్ రికార్డును బద్దలు కొట్టనున్న ఎంబాపె ఆ తర్వాత మెస్సీని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితా
👉లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)-18
👉కైలియ‌న్ ఎంబాపె (ఫ్రాన్స్‌)-16
👉మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ)-16
👉రొనాల్డో (బ్రెజిల్)- 15
👉గెర్డ్ ముల్లర్ (జర్మనీ)-14
👉జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్)- 13
👉పీలే (బ్రెజిల్)-12

Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement