
క్రికెట్ చరిత్రలో ఊహలకందని అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ బౌలర్ ఓ మ్యాచ్‌లో వరుసగా రెండో ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టూ కౌంటీస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీ డివిజన్-6లో భాగంగా కెస్‌గ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐప్స్విచ్ అండ్ కోల్‌చెస్టర్ క్రికెట్ క్లబ్ స్పిన్ బౌలర్ కిషోర్ కుమార్ సాథక్ వరుస ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు వేసిన సాథక్ 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు కెస్‌గ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఓ ఫీట్ నమోదైన దాఖలాలు ఎక్కడా లేవు. 2017లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్‌కు ఆడుతూ రెండు హ్యాట్రిక్‌లు తీశాడు. అలాగే 113 ఏళ్ల కిందట ఓల్డ్ ట్రాఫర్డ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ జిమ్మీ మాథ్యూస్ కూడా ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీశాడు.అయితే ఈ రెండు సందర్భాల్లో రెండు హ్యాట్రిక్‌లు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదయ్యాయి.

కాగా, ఇంచుమించు ఇలాంటి ఘటనే ఒకటి నిన్న పొట్టి క్రికెట్‌లో కూడా నమోదైంది. ఐర్లాండ్ ఇంటర్ ఫ్రావిన్సియల్ టోర్నీలో ఓ బౌలర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో మన్‌స్టర్ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్ కూడా) ఐర్లాండ్ జాతీయ జట్టు ప్లేయర్ కర్టిస్ క్యాంఫర్.. నార్త్ వెస్ట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కర్టిస్ 11వ ఓవర్ చివరి 2 బంతులకు 2 వికెట్లు, 13వ ఓవర్ తొలి మూడు బంతులకు 3 వికెట్లు తీశాడు. టెక్నికల్‌గా కర్టిస్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీశాడు.
పురుషుల ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో (అంతర్జాతీయ క్రికెట్, దేశవాలీ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్) మునుపెన్నడూ ఏ బౌలర్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. అయితే ఓ స్థానిక మ్యాచ్‌లో మాత్రం ఇటీవలే ఈ ప్రదర్శన నమోదైంది. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడే దిగ్వేశ్ రాఠీ ఒకే ఓవర్‌లో వరుసగా 5 వికెట్లు తీశాడు. ఇందులో తొలి నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం మరో విశేషం.