
ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లతో సత్తాచాటాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు పక్కన పెడితే ఆఖరి టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే.
చారిత్రత్మక ఓవల్ మైదానంలో సిరాజ్ మియా బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత జట్టు మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వేసిన బంతులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
ఈ మ్యాచ్ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నప్పటికి సిరాజ్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరాజ్ లాంటి బౌలర్లు భారత జట్టుకు మరింత మంది కావాలని ఆయన అన్నారు.
"సిరాజ్ రియల్ హీరో. అతడు తన బౌలింగ్ సిద్దాంతాన్ని నమ్ముకున్నాడు. అతిగా ఏదీ ప్రయత్నించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం, ముఖ్యంగా ఆఫ్ స్టంప్ చుట్టూ బంతులు వేస్తూ ప్రత్యర్ధిని బెంబెలెత్తించాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హజరీలో బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేశాడు.
భారత క్రికెట్‌కు సిరాజ్ లాంటి వాళ్లు మరి కొంతమంది అవసరం. ఆఖరి రోజు ఆటలో సిరాజ్ చాలా కన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ జేమీ స్మిత్‌ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహన్ని నింపాడు.
సిరాజ్ నాలుగో రోజు ఆటలో ఒక క్యాచ్ వదిలేసాడు. కానీ ఆ తర్వాత బౌలింగ్‌లో తన సత్తాచూపించాడు. అతడిలో కనీసం ఒత్తిడి కన్పించలేదు. ఇది కొంతమందికే సాధ్యమని" కపిల్‌దేవ్ మిడ్ డే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ పేర్కొన్నారు.
చదవండి: IND-A vs AUS-A: టీమిండియా ఘోర ఓటమి.. 73 పరుగులకే ఆలౌట్