
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టుకు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మెక్‌కే వేదికగా ఆసీస్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ టీమ్ కెప్టెన్ అలీసా హీలీ(44 బంతుల్లో 12 ఫోర్లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విల్సన్(43), అనికా లియార్డ్(35) రాణించారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా..ప్రేమా రావత్ ఒక్క వికెట్ సాధించారు.
చెలరేగిన గార్త్..
అనంతరం లక్ష్య చేధనలో ఇండియా-ఎ జట్టు ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. పేసర్ కిమ్ గార్త్ నాలుగు వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు, ఎడ్గర్,ఫ్లింటాప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
భారత బ్యాటర్లలో వ్రింధా దినేష్(21), మిన్ను మణి(20) రెండెంక్కల స్కోర్‌ను అందుకోగా.. మిగితా వారిందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ(3) సైతం బ్యాట్ ఝుళిపించకలేకపోయారు.
ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ను ఆసీస్-ఎ జట్టు మరో మ్యాచ్ మిగిలూండగానే సొంతం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 మెక్‌కే వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే?