
Photo Courtesy: BCCI
వాయిదా అనంతరం జరుగబోయే ఐపీఎల్ 2025లో పాల్గొనాల్సి ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్లపై సందిగ్దత వీడింది. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), లియామ్ లివింగ్‌స్టోన్ (ఆర్సీబీ) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు (ఈసీబీ) చెందిన ఓ కీలక అధికారి స్పష్టం చేశారు.
అయితే వీరిలో వెస్టిండీస్ సిరీస్‌కు (ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరిగే సిరీస్) ఎంపికైన బట్లర్, బేతెల్, జాక్స్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే వరకే సంబంధిత ఫ్రాంచైజీలతో ఉంటారని, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తేల్చేశారు.
మరోవైపు జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్‌కే), సామ్ కర్రన్ (సీఎస్‌కే) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి రారని కూడా స్పష్టం చేశారు. మరో ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్ (ఆర్సీబీ), మొయిన్ అలీపై (కేకేఆర్) క్లారిటీ లేదని అన్నారు.
సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్‌కు సంబంధించి వారి ఫ్రాంచైజీ (సీఎస్‌కే) ఇదివరకు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. రాజస్థాన్ కూడా ఆర్చర్ అందుబాటులోకి రాడన్న విషయాన్ని లైట్‌గా తీసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కర్రన్, ఓవర్టన్, ఆర్చర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్ల కోసం కూడా ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
కాగా, ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో (మే 29, జూన్ 1, 3) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. హ్యారీ బ్రూక్ తొలిసారి నాయకత్వం వహిస్తున్న ఇంగ్లిష్ జట్టులో ఐపీఎల్ స్టార్లు బట్లర్, ఆర్చర్, ఓవర్టన్, విల్ జాక్స్, జేకబ్ బేతెల్‌కు చోటు దక్కింది.
ఇదిలా ఉంటే, భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు తిరిగి భారత్‌కు రానున్నారు.
మే 8న రద్దైన ఐపీఎల్.. మే 17న పునఃప్రారంభం కానుంది. లీగ్ దశ మ్యాచ్‌లు మే 27న ముగియనుండగా.. మే 29 (తొలి క్వాలిఫయర్), మే 30 (ఎలిమినేటర్), జూన్ 1 (రెండో క్వాలిఫయర్) తేదీలోల ప్లే ఆఫ్స్ జరుగనున్నాయి. జూన్ 3న ఫైనల్ జరుగనుంది.