Sakshi News home page

Bengaluru: స్టంప్‌ బ్రేక్‌ చేసిన జోఫ్రా ఆర్చర్‌.. వీడియో వైరల్‌

Published Fri, Mar 15 2024 6:30 PM

Jofra Archer Substitute Pacer for Karnataka Breaks Stumps in Bengaluru - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్‌.. కర్ణాటక టీమ్‌లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?!

ఇంగ్లండ్‌ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్‌, లంకాషైర్‌ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో  పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా బెంగళూరుకు విచ్చేశాడు.

ససెక్స్‌- కర్ణాటక(అండర్‌ 19, అండర్‌ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్‌) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్‌ సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌల్‌ చేసిన ఆర్చర్‌ దెబ్బకు స్టంప్‌ బ్రేక్‌ అయిపోయింది.

ఇక మరో సందర్భంలో బ్యాటర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్‌ అవుట్‌ చేసిన వీడియోలను ససెక్స్‌ క్రికెట్‌  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా గాయం కారణంగా ఐపీఎల్‌-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్‌(ముంబై ఇండియన్స్‌).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్‌-2024 నాటికి ఇంగ్లండ్‌ జట్టుతో చేరే అవకాశం ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement