
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. వినోద్ కాంబ్లీ (Vinod Kambli)... ఈ ఇద్దరు ముంబై తరఫున దాదాపు ఒకేసారి క్రికెట్లో అడుగుపెట్టారు. ఇద్దరూ కలిసి దేశవాళీ క్రికెట్ ఆడుతూ తమను తాము నిరూపించుకున్నారు. ఈ క్రమంలో దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు.
ఇక ముందూ ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డు
అయితే, సచిన్ టెండుల్కర్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మద్యానికి బానిసై..
మరోవైపు.. వినోద్ కాంబ్లీ మాత్రం తన ప్రతిభను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రమశిక్షణారాహిత్యం, వివాదాల కారణంగా కెరీర్‌నే కోల్పోయాడని అతడి గురించి తరచూ విమర్శలు వస్తుంటాయి. అంతేకాదు.. మద్యానికి బానిసై ఇటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం విషయంలోనూ అశ్రద్ధ కారణంగా అయినవాళ్లకూ దూరమయ్యాడు కాంబ్లీ.
సచిన్ కంటే నేనే గొప్ప?
అయితే, భార్య ఆండ్రియా కారణంగా తిరిగి మామూలు మనిషినైన వినోద్ కాంబ్లీ.. 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుల సాయంతో కోలుకుంటున్నాడు. ఇక కాంబ్లీని చుట్టుముట్టిన ఎన్నో వివాదాల్లో.. తాను సచిన్ కంటే గొప్ప ఆటగాడినని చెప్పినట్లు వచ్చిన వార్త ఒకటి.
నేనైతే ఎప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమే
ఈ విషయంపై వినోద్ కాంబ్లీ సోదరుడు వీరేంద్ర తాజాగా స్పందించాడు. ‘‘వారిద్దరు ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. నైపుణ్యాల విషయంలో ఇద్దరూ సమానమే. సచిన్ కంటే నా సోదరుడు బెటర్ అని ఎవరూ చెప్పరు. అలాగే.. కాంబ్లీ కంటే సచిన్ మెరుగైన ఆటగాడు అని కూడా అనలేరు.
వాళ్లిద్దరు సేమ్. తాను సచిన్ కంటే బెటర్ ప్లేయర్ అని నా సోదరుడు చెప్పడాన్ని నేనైతే ఎప్పుడూ వినలేదు. అంతేకాదు.. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా అబద్ధం. సచిన్ దాదా వినోద్‌కు ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు.
సచిన్ దాదా వినోద్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తారు
వారి స్నేహ బంధం గొప్పది. ఆండ్రియాకు ఫోన్ చేసి వినోద్ ఆరోగ్య సమాచారం గురించి సచిన్ దాదా ఆరా తీస్తుంటారు. సచిన్ దాదా వినోద్‌కు క్లోజ్ ఫ్రెండ్. రంజీ మ్యాచ్‌లు ఆడేపుడు నేను వినోద్‌తో కలిసి డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లినపుడు.. సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. వారిద్దరు మంచి స్నేహితులు’’ అంటూ కాంబ్లీ- సచిన్‌ల గురించి విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అదే విధంగా.. క్రికెట్ ఆడే యువకులు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నిరాండబరంగా ఉండాలని వీరేంద్ర కాంబ్లీ ఈ సందర్భంగా సూచించాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా సచిన్ దాదా మాదిరి ఒదిగి ఉంటే.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించవచ్చని చెప్పాడు.
సచిన్, వినోద్ చిన్ననాటి నుంచే ఎంతో కష్టపడి ఆటగాళ్లుగా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నాడు. ఏదేమైనా కాళ్లు నేల మీదే ఉండాలని.. అప్పుడే విజయం ఎల్లప్పుడు మన వెంటే ఉంటుందని వీరేంద్ర కాంబ్లీ చెప్పుకొచ్చాడు.
చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా