
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఓ ప్రధాన మార్పు చోటు చేసుకుంది. బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మహారాజ్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరాడు.
ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను రెండు, మూడు స్థానాలకు నెట్టాడు. టీమిండియా నుంచి కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా టాప్-10లో(తొమ్మిదో స్థానం) ఉన్నాడు. భారత పేస్ త్రయం షమీ, బుమ్రా, సిరాజ్ వరుసగా 13, 14, 15 స్థానాల్లో ఉన్నారు.
బ్యాటర్ల విభాగంలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ స్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజమ్, డారిల్ మిచెల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (6) టాప్ 10లో ఉన్నాడు.
ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రోహిత్ రెండు.. విరాట్ నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆకస్మికంగా వారి పేర్లు ర్యాంకింగ్స్ నుంచి మాయమైపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మొహమ్మద్ నబీ టాప్-2లో కొనసాగుతుండగా.. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ 10లో (పదో స్థానం) ఉన్నాడు.
మహారాజ్ మాయాజాలం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 297 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
ఫలితంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో ఓడించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ప్రదర్శనతో మహారాజ్ పలు రికార్డులను కొల్లగొట్టాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని దక్కించుకున్నాడు.